శస్త్ర చికిత్సలకు పల్లెవాసులు దూరం! కారణం ఇదే..!

ABN , First Publish Date - 2022-06-23T16:14:37+05:30 IST

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంకా చెప్పాలంటే వైద్య సదుపాయాలు లేక పల్లె వాసులు సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. లాన్సెట్‌ కమిషన్‌..

శస్త్ర చికిత్సలకు పల్లెవాసులు దూరం! కారణం ఇదే..!

వంద మందికి సర్జరీలు అవసరమైతే అందులో చేయించుకుంటున్నది ఇద్దరే

సదుపాయాలు లేక వాయిదాకే మొగ్గు

తెలంగాణలోని పల్లెల్లో ఇదీ పరిస్థితి

తాజా అధ్యయనంలో వెల్లడి


హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంకా చెప్పాలంటే వైద్య సదుపాయాలు లేక పల్లె వాసులు సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. లాన్సెట్‌ కమిషన్‌ గణాంకాల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాలో ఐదు వేల మందికి మేజర్‌ సర్జరీలు(గైనిక్‌, కాటరాక్ట్‌ సర్జరీలు మినహా మత్తుమందు ఇచ్చి చేసేవి) అవసరమవుతాయని అంచనా. కానీ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా శస్త్రచికిత్సల సంఖ్య 106కు మించడం లేదు. ఇంకా చెప్పాలంటే సర్జరీలు అవసరమైన ప్రతి వంద మందిలో కేవలం ఇద్దరే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పల్లెల్లో సర్జరీల సగటు 341 ఉండగా, తెలంగాణలో అది 106కే పరిమితమైనట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాకు చెందిన డ్యూక్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌, డ్యూక్‌ వర్సిటీ,  గ్లోబల్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌, ఇండియాలోని పుణెకు చెందిన అసోసియేషన్‌ ఫర్‌ సోషియల్లీ అప్లికేబుల్‌ రీసెర్చ్‌ సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. అందులోని వివరాలను ప్రముఖ జర్నల్‌ మెడ్రిక్సివ్‌ ప్రచురించింది. దేశంలోని 36 రాష్ట్రాల్లో ఉన్న 660 జిల్లాల్లో 2017 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి వరకు జరిగిన శస్త్రచికిత్సలను పరిగణనలోకి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ఈ మేరకు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. పల్లె ప్రజలు వైద్యం కోసం ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తుందని, పట్టణాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వెల్లడించింది.


రాష్ట్రాల్లో ఇలా..

రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంత ప్రజలు చేయించుకునే సర్జరీల శాతాన్ని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. దక్షిణాదిన అతి తక్కువ సర్జరీలు జరిగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందువరుసలో ఉంది. సర్జరీలు అవసరమైన ప్రతి ఐదు వేల మందిలో చేయించుకుంటున్న వారి సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ఐదు కేటగిరీలుగా ఆయా రాష్ట్రాలను విభజించారు. 0-250 మధ్య సర్జరీలు జరిగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, అసోం, మిజోరం ఉన్నాయి. 250-500 మధ్య సర్జరీలు జరిగే జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, మేఘాలయ, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఉన్నాయి. 500-750 మధ్య జాబితాలో తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. 750-1000 మధ్య జాబితాలో జమ్ముకశ్మీర్‌ ఉండగా, 1000కి పైబడి సర్జరీలు జరుగుతోన్న రాష్ట్రాల జాబితాలో కేరళ, మిజోరం ఉన్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసరమైతే తప్ప... సర్జరీలు చేయించుకోవడం లేదు. కొన్ని సర్జరీలు వెంటనే చేయించుకోకపోవడం వల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. అటువంటి సర్జరీలను వెంటనే చేయించుకోవడం లేదు. వాటిని వాయిదా వేసుకుంటున్నారు. ప్రాణాల మీదకు వచ్చినప్పుడే ఆస్పత్రులకు వచ్చి సర్జరీలు చేయించుకుంటున్నారు’’ అని అధ్యయనంలో తేలింది.

Updated Date - 2022-06-23T16:14:37+05:30 IST