కుంగిన వంతెనతో గ్రామస్థులకు తప్పని దూరాభారం

ABN , First Publish Date - 2022-08-20T03:55:33+05:30 IST

కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ వద్ద పెద్దవాగుపై నిర్మించిన వంతెనకు చెందిన ఒక పిల్లర్‌ గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఒక కుంగిపోయింది. దీంతో దహెగాం, భీమిని మండలాలకు కాగజ్‌నగర్‌ పట్టణానికి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

కుంగిన వంతెనతో గ్రామస్థులకు తప్పని దూరాభారం
కుంగిపోయిన జగన్నాథ్‌పూర్‌ వంతెన

- రెండు నెలల క్రితం కుంగిన జగన్నాథ్‌పూర్‌ వంతెన

- రెండు మండలాలకు నిలిచిన రాకపోకలు

- బెల్లంపల్లి మీదుగా కాగజ్‌నగర్‌కు 

- ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 19: కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ వద్ద పెద్దవాగుపై నిర్మించిన వంతెనకు చెందిన ఒక పిల్లర్‌ గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఒక కుంగిపోయింది. దీంతో దహెగాం, భీమిని మండలాలకు కాగజ్‌నగర్‌ పట్టణానికి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెనపై నుంచి ఎవరూ వెళ్లకుండా గోడ కట్టారు. ఈ రెండు మండలాల వారు చుట్టూ తిరిగి బెల్లంపల్లి మీదుగా కాగజ్‌నగర్‌కు రావాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం వ్యాపారలావాదేవీలు జరుపుకునే వారికి ఒక్కసారిగా ఊహించని దెబ్బతాకినట్లయింది. అధికారులు దారి మళ్లించారే తప్పా ఏడాది నుంచి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. ప్రతిపాదనలు మాత్రమే పంపించారు. దీంతో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వంతెన పిల్లర్‌ మరింత కుంగిపోయింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అంతా భయపడుతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే పెద్దవాగుకు వరద తీవ్రత అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ పిల్లర్‌ పూర్తిగా పడిపోయే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

కాగజ్‌నగర్‌కు వెళ్లాలంటే వయా బెల్లంపల్లి..

దహెగాం, భీమిని మండలాల వాసులు కాగజ్‌నగర్‌కు రావాలంటే ఇప్పుడు బెల్లంప మీదుగా రావాల్సిన పరిస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. తమకు అత్యవసరం అయితే కాగజ్‌నగర్‌కు వచ్చేవాళ్లమని, ఇప్పుడు బెల్లంపల్లి మీదుగా రావాలంటే పడరాని పాట్లు పడాల్సి వస్తోందంటున్నారు. దహెగాం నుంచి కాగజ్‌నగర్‌కు రావాలంటే 32కిలోమీటర్ల దూరం ఉండేది. కానీ ఇప్పుడు దహెగాం నుంచి బెల్లంపల్లి మీదుగా కాగజ్‌నగర్‌కు రావాల్సి ఉంటుంది. దహెగాం నుంచి బెల్లంపల్లికి 39కిలోమీటర్లు, బెల్లంపల్లి నుంచి కాగజ్‌నగర్‌కు 40కిలోమీటర్లు మొత్తం 79కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొంది. దహెగాం, భీమిని మండలాల నుంచి కాగజ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంతో పాటు ఇతర పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను చూసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకునేందుకు రావాలంటే కనీసం 79కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి అదనపు వ్యవయంతో పాటు సమయం కూడా వృధా అవుతోందని వాపోతున్నారు. అధికారులు వంతెనకు త్వరగా మరమ్మతులు చేసి సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని అంతా కోరుతున్నారు. 

సర్వేలు పూర్తి చేసిన అధికారులు..

కాగజ్‌నగర్‌ జగన్నాథ్‌పూర్‌ వంతెనపై రాక పోకలు పూర్తిగా నిలిపివేసి ఆర్‌అండ్‌బీ అధికారులు  సర్వే చేపట్టారు. ఆర్‌అండ్‌బి డీఈఈ లక్ష్మినారాయణ, సిబ్బంది దెబ్బతిన్న పిల్లర్‌ను పరిశీలించారు. పిల్లర్‌ పునర్నిర్మాణానికి ఏం చేయాలి? ఇందుకు అయ్యే ఖర్చు వివరాలను అంచనా వేస్తున్నారు. కుంగిన పిల్లర్‌ స్థానంలో కొత్తడి నిర్మిండంతో పాటు రెండు స్లాబ్‌లు వేయాల్సి ఉంటుందని అంచనాలు రూపొందించారు. ఇందుకయ్యే ఖర్చు, సమయం తదితరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.

బెల్లంపల్లి మీదుగా వచ్చాం..

-సత్తయ్య, మల్లిడి, భీమిని 

మా పిల్లలు కాగజ్‌నగర్‌ మైనార్టీ గురుకుల పాఠశాల-1లో చదువుతున్నారు. వర్షాలు పడిన తర్వాత పిల్లలను చూడలేదు. ఏమి చేయాలో పాలుపోక వెంటనే బెల్లంపల్లికి వెళ్లి అక్కడి నుంచి మళ్లీ కాగజ్‌నగర్‌కు వచ్చాం. కిందటేడు వర్షాలకు పిల్లర్‌ వంగింది. అధికారులు అప్పటి నుంచి ఏమీ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలంటే బెల్లంపల్లికి పోవాలి. అక్కడి నుంచి మళ్లీ ఆటోలు, బైక్‌ల ద్వారా ఇంటికి పోవాల్సి వస్తోంది. చాలా కష్టపడుతున్నాం.

చాలా ఇబ్బందులు పడుతున్నాం

-సాగర్‌, మల్లిడి, భీమిని  

అధికారులు మొదట పట్టించుకోలేదు. ఇప్పుడు రాకపోకలు బంద్‌ చేసిండ్రు. చిన్న పనికి కూడా కాగజ్‌నగర్‌కు వచ్చి పోయేవాళ్లం. ఇప్పుడు బెల్లంపల్లి నుంచి కాగజ్‌నగర్‌కు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు ముందే పనులు ప్రారంభిస్తే వంతెనకు ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదు. భారీ వర్షాలు పడటంతో పిల్లర్‌ కుంగిపోయింది. మళ్లీ వర్షాలు పడితే పిల్లర్‌ పూర్తిగా కూలిపోతుంది.

Updated Date - 2022-08-20T03:55:33+05:30 IST