తూతూమంత్రంగా పల్లె ప్రగతి!

ABN , First Publish Date - 2022-07-03T05:10:37+05:30 IST

గ్రామాలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు తూతూమంత్రంగా నిర్వహించారు.

తూతూమంత్రంగా పల్లె ప్రగతి!
అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలపల్లిలో చెత్తాచెదారంతో నిండిన మురుగు కాలువ,

పేరుకుపోయిన చెత్తాచెదారం

పట్టించుకోని గ్రామపంచాయతీ  పాలకవర్గం, అధికారులు

అక్కన్నపేట, జూలై 2: గ్రామాలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు తూతూమంత్రంగా నిర్వహించారు. జూన్‌ 3 నుంచి 18 వరకు పదిహేను రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు అక్కన్నపేట మండలంలోని గ్రామాల్లో నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారు. అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలపల్లిలో మురుగు కాలువలు చెత్తతో నిండి ఉన్నాయి. రోడ్లపై చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, గడ్డితో నిండి పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉన్నది. 15 రోజులపాటు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం ఏ విధంగా నిర్వహించారో ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు  గ్రామపంచాయతీ సిబ్బంది గానీ, పంచాయతీ కార్యదర్శి గానీ, ప్రజాప్రతినిధులు గానీ పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించలేదని గ్రామస్థులు ఆరోపించారు. మురుగు కాలువలో చెత్తాచెదారం నిండి దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-07-03T05:10:37+05:30 IST