Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 05 Jul 2022 22:36:32 IST

సమస్యల వలయంలో పల్లెలు

twitter-iconwatsapp-iconfb-icon
సమస్యల వలయంలో పల్లెలుమంచిర్యాల జిల్లా పరిషత్‌ కార్యాలయం

అరకొర నిధులతో అభివృద్ధికి ఆటంకం 

సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కలగని మోక్షం

నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

మంచిర్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి అరకొరగా నిధులు విడుదల అవుతుండటంతో అభివృద్ధికి ఆటంకం కలిగి ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి. పారిశుధ్య సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకొనేవారు లేరు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం, పలు గ్రామాల్లోని దళిత వాడల్లో నాళాలు, అంతర్గత రోడ్లు లేవు. పారిశుధ్యలోపం తలెత్తి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరాల తరబడి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారేమోనని ప్రజలు గంపెడాశతో ఉన్నారు.  

జడ్పీ భవన నిర్మాణానికి మోక్షమెప్పుడో..?

జడ్పీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి  మోక్షం లభించడంలేదు. ప్రస్తుత భవనం సమావేశాల నిర్వహణకు అనువుగా లేదు. ఈ విషయమై 2019 ఆగస్టు 26న జరిగిన తొలి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ ప్రస్తుత భవనం సముచితంగా లేదని,  కలెక్టర్‌ స్థలం కేటాయిస్తే నిధులు మంజూరు చేయించడం ద్వారా నూతన భవన నిర్మాణాన్ని చేపడతామన్నారు. కలెక్టర్‌ స్థలం చూపిస్తే రూ. 10 కోట్లతో యేడాదిలో భవన నిర్మాణం పూర్తి చేస్తామని సమావేశంలో పాల్గొన్న మంత్రి ఐకే రెడ్డి పేర్కొన్నారు. అయితే మూడు సంవత్సరాలు గడుస్తున్నా స్థలం కేటాయింపులు జరగకపోవడంతో భవన నిర్మాణానికి మోక్షం కలగడం లేదు.

నిధుల లేమితో కుంటుపడుతున్న అభివృద్ది....

జిల్లా పరిషత్‌లకు అవసరమైన నిధులు కేటాయిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో పెట్టకపోవడంతో గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నిధుల లేమి కారణంగా ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తదితర కనీస సౌకర్యాల కల్పనకు నోచుకోవడం లేదు. గ్రామాల్లో చిన్న చిన్న మౌలిక వసతుల కల్పనకు ఎంపీపీలకు ఇవ్వవలసిన నెలవారీ కాంటిజెన్సీ గ్రాంటు 5 సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. 

ఈ సమస్యలు తీరేనా..?

-దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. స్లాబు పెచ్చులూడి పోతుండగా, ముందు పిల్లర్‌ సగానికిపైగా కూలిపోయి ప్రమాదకరంగా మారింది. మ్యాదరిపేట మెయిన్‌ రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులు రెండుసార్లు టెండర్‌ రద్దయి పనులు జరగడం లేదు. తానిమడుగు వద్ద గూడెం లిఫ్ట్‌ డెలివరీ పాయింట్‌ దగ్గర క్రాస్‌ రెగ్యులేటర్‌ కోసం రూ.60 లక్షలు మంజూరుకాగా, టెండర్లు కూడా పూర్తయ్యాయి. అయినా పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం ఘాట్‌ రోడ్డు పనులు దాదాపు 5 సంవత్సరాలుగా నిలిచిపోయాయి.  

-హాజీపూర్‌ మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పంట పొలాలకు నీరు సరఫరా చేస్తామన్న హామీ నెరవేరడంలేదు. కడెం కెనాల్‌ ద్వారా వచ్చే నీరు అన్ని గ్రామాల రైతులకు సరిపోక పంటలు పండించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 

-నెన్నెల మండల కేంద్రం సమీపంలోని ఎర్రవాగుపై బ్రిడ్జి లేని కారణంగా వర్షాకాలంలో కాజ్‌వే పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో కుర్మగూడం, లంబాడితండా, మన్నెగూడెం, జంగాల్‌పేట, కోనంపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆవడం-భీమారం డబుల్‌ రోడ్డు పనులు నిలిచిపోయాయి. కంకరవేసి బీటీ వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పశువుల ఆస్పత్రి, తహసీల్దార్‌ కార్యాలయం, పోస్టాఫీసు, శాఖ గ్రంథాలయానికి సొంత భవనాలు లేవు. 

- భీమిని మండలంలోని వీగాంలో రోడ్లు బురదమయంగా మారి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. 

- మందమర్రి మండలం అందుగులపేట- శంకర్‌పల్లి, ఊరు మందమర్రి-మామిడి గూడెం వెళ్లేందుకు వాగులపై వంతెనలు నిర్మించకపోవడంతో వానాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. 

ముంపు రైతులకు పరిహారం ఎప్పుడు..?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌ కారణంగా జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు నష్టం కలుగుతోంది. యేటా రెండు, మూడు సార్లు చేతికి వచ్చిన పంటలు నీట మునుగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాలైన చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. పంట నీట మునిగినప్పుడల్లా అధికారులు సర్వే జరిపి, పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు. 2019 నుంచి ఇదే తంతు జరుగుతుండగా ప్రభుత్వపరంగా రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.