ప్రపంచంలోనే అదొక వింత గ్రామం.. గుహలలోనే వారి నివాసం.. మరిన్ని విశేషాలు మీకోసం!

ABN , First Publish Date - 2022-01-13T16:28:39+05:30 IST

అక్కడివారంతా భూమిని తొలిచి ఏర్పాటు చేసుకున్న గుహల్లో..

ప్రపంచంలోనే అదొక వింత గ్రామం.. గుహలలోనే వారి నివాసం.. మరిన్ని విశేషాలు మీకోసం!

అక్కడివారంతా భూమిని తొలిచి ఏర్పాటు చేసుకున్న గుహల్లో నివసిస్తుంటారు. 1969 వరకు ప్రపంచంలోని ఎవరికీ ఆ గ్రామం గురించి తెలియదు. 1969లో వచ్చిన భారీ వరదల కారణంగా భూగర్భంలో నిర్మించిన ఇళ్లు జలమయమైనప్పుడు ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఇక్కడి నుండి బాధితులను హడావుడిగా ఖాళీ చేయించారు. అయితే పరిస్థితులు చక్కబడ్డాక ఆ గ్రామస్తులు తిరిగి అవే గుహలలోకి వెళ్లిపోయారు. ఈ గ్రామం ట్యునీషియాకి దక్షిణ భాగంలో ఉంది. గ్రామం పేరు మత్మత. ఈ గ్రామంలో నివాసం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ భూమి కింద లోతైన గుహలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి చాలా దూరంగా ఉన్నాయి. ఈ ప్రదేశం పర్యాటక కేంద్రంగా మారింది. 


స్టార్ వార్‌తో సహా పలు హాలీవుడ్ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. భూగర్భ గుహలలో ఎందుకు నివసిస్తున్నారనేదానిపై గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ఇళ్లు మాకు ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ ఇళ్లు చలి, ఎండ వేడిమి నుంచి మమ్మల్ని రక్షిస్తాయని తెలిపారు. ఈ గ్రామస్తులు ఈ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇది తమకు అత్యంత సురక్షితమైన ప్రదేశం అని వారు భావిస్తున్నారు. ఈ భూగర్భ గృహాలలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ విద్యుత్, టెలివిజన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో గ్రామస్తులు తమ ఇళ్లలోని కొన్ని గదులను హోటళ్లుగా మార్చారు. ఇవి వారికి ఆదాయ వనరుగా మారింది. ఈ గ్రామానికి చెందిన 46 ఏళ్ల మోంజియా మాట్లాడుతూ తాను ఈ ఇంటిని వదిలి ఎక్కడికీ వెళ్లాలని అనుకోను. ఇక్కడ లభించే ప్రశాంతత ఎక్కడా దొరకదని అన్నారు.



Updated Date - 2022-01-13T16:28:39+05:30 IST