ప్రతి సచివాలయ పరిధిలో విలేజ్‌ క్లినిక్‌

ABN , First Publish Date - 2020-05-27T11:19:45+05:30 IST

ప్రతి గ్రామ సచివాలయ పరిధిలోను ఒక విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, స్థల సేకరణ కూడా చివరి దశకు చేరుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్‌(నాని) చెప్పారు.

ప్రతి సచివాలయ పరిధిలో విలేజ్‌ క్లినిక్‌

అమలాపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామ సచివాలయ పరిధిలోను ఒక విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, స్థల సేకరణ కూడా చివరి దశకు చేరుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్‌(నాని) చెప్పారు. వైద్య రంగంలో సమూలంగా మార్పులు తీసుకువచ్చి పేదలకు పూర్తిస్థాయిలో ఉచితంగా వైద్య సేవలను అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అమలాపురానికి రూ.500 కోట్లతో నిర్మించే వైద్య కళాశాల మంజూరు చేశారన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డిలతో కలిసి భట్నవిల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనువుగా ఉన్న 52 ఎకరాల స్థలాన్ని మంత్రి నాని మంగళవారం పరిశీలించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి నాని మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 27 వైద్య కళాశాలలు మంజూరు చేశారన్నారు.


కళాశాలలకు అనుబంధంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని, పరికరాలను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు రైతులు సహకరించాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి నాని తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావు, ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌, డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా, తహశీల్దార్‌ కేవీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-27T11:19:45+05:30 IST