పల్లె ప్రగతి పట్టాలెక్కేనా!?

ABN , First Publish Date - 2021-02-27T04:45:55+05:30 IST

సుమారు రెండున్నరేళ్ల తర్వాత పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్నో ఆశలు, అకాంక్షలతో సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నికయ్యారు.

పల్లె ప్రగతి పట్టాలెక్కేనా!?
సిమెంటు రోడ్డు, కాలువకు నోచుకోని కొరిమెర్ల బీసీ కాలనీ

కొత్త సర్పంచులకు సమస్యల స్వాగతం

రెండున్నరేళ్ల తర్వాత పాలకవర్గాల కొలువు

పుష్కలంగా ఆర్థిక సంఘం నిధులు

ఖర్చు చేసేందుకు సమయం నెలే గడువు!

లేకుంటే మురిగిపోయే ప్రమాదం


సంగం, ఫిబ్రవరి 26 : సుమారు రెండున్నరేళ్ల తర్వాత పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్నో ఆశలు, అకాంక్షలతో సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. ఇన్నాళ్లు ప్రత్యేక అధికారుల హయాంలో సాగిన పాలన ఇప్పుడు వారి చేతుల్లోకి వెళ్లాయి. ఈ తరుణంలో  ప్రతి పంచాయతీలో సమస్యలు తిష్ఠ వేశాయి. రోడ్డు, డ్రైనేజీలు, పారిశుధ్య లోపం, నీటి సరఫరా, పాఠశాలలు, అంగన్‌వాడీలకు ప్రహరీ లేకపోవడం, వీధిలైట్లు వంటి అనేక సమస్యలు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే కొత్త పాలకవర్గాల చొరవ, నిధుల అవసరం ఉంది. 


అందుబాటులో నిధులు


గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 14, 15వ ఆర్థిక సంఘం నిధులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి పంచాయతీ దాని స్థాయిని బట్టీ రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 940 పంచాయతీల బ్యాంకు ఖాతాలలో సుమారు రూ. 100 కోట్లకుపైగా నిధులు మూలుగుతున్నాయి. అయితే ఈ నిధులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే అంటే మార్చి 31వ తేదీ నాటికే ఖర్చు చేయాల్సి ఉంది. లేదంటే  అవన్నీ మురిగిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఎన్నికైన సర్పంచులు చకచకా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ, స్కూలు, అంగన్‌వాడీ కేంద్రాలు, శ్మశానాల ప్రహరీ నిర్మాణాలు చేపట్టవచ్చు. తాగునీటి పథకాలకు  కూడా నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. వేసవి మొదలు కానుండటంతో నీటి ఎద్దడిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు జరగకుండా ఉంటే ఆర్థిక సంఘాల నిధులు వచ్చేందుకు అవకాశం లేకపోయినా కరోనా పరస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఈ నిధులు చాలామటుకు ఇప్పటికే ఖర్చుచేయాల్సి ఉన్నా ప్రత్యేక అధికారుల పాలనలో పనుల కేటాయింపునకు రాజకీయ సమస్యలు తలెత్తడంతో ఆలస్యమైంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల సూచనలతో ఈ నిధులు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినా ఇంతలోపే పంచాయతీ ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండున్నర ఏడాది తరువాత కొలువ తీరుతున్న పంచాయతీ పాలకవర్గాలు, అధికారుల సమన్వయంతో ఈ నిధులతో అభివృద్ధి పనులు మార్చి 31లోపు చేపట్టేందుకు త్వరితగతిన చొరవ చూపాల్సి ఉంది. లేకపోతే నిధులు మురిగిపోతాయి. అధికారులు, పాలకవర్గాలు ఆ దిశగా చొరవ చూపి నిధులను సద్వినియోగం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టి పాలకవర్గాలను చైతన్యం పరచి నిధులను సద్వినియోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Updated Date - 2021-02-27T04:45:55+05:30 IST