ఉద్యానం.. విలాపం

ABN , First Publish Date - 2022-07-19T05:30:00+05:30 IST

అన్నదాతలు ఏళ్ల తరబడి పండించే సంప్రదాయ పంటలను వీడారు. ప్రయోజనకరంగా ఉంటుందన్న అధికారుల మాటలతో ఉద్యాన పంటల వైపు అడుగేశారు.

ఉద్యానం.. విలాపం

రైతులకు అందని రాయితీలు

జిల్లాలో రూ.2.25 కోట్ల మేర బకాయిలు

రూ.8.31 కోట్ల రాయితీలకు అధికారుల ప్రణాళిక 

ఈ ఏడాదైనా సకాలంలో ఉద్యాన రైతులకు అందేనా


ఉద్యాన పంటలతో ఎంతో లబ్ధి.. రైతులు ఎక్కువగా సంప్రదాయ పంటలను వీడి కొత్త వాటివైపు అడుగులు వేయాలి.. ప్రోత్సాహంతో పాటు రాయితీలు విరివిరిగా అందిస్తాం.. అన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణలో అమలు కావడంలేదు. అధికారుల మాటలు కబుర్లకే పరిమితమయ్యాయి. పాపం రైతులు మాత్రం నష్టపోయారు. ఎన్నో ఏళ్లుగా తమకు అలవాటైన.. అనుకూలమైన సంప్రదాయ పంటలను సాగు చేసుకుంటూ వస్తున్న రైతులు అధికారుల మాటలు విని ఉద్యాన సాగుపై దృష్టి సారించారు.   అయితే రెండేళ్లనుంచి ఉద్యాన రైతులకు పూర్తి స్థాయిలో రాయితీలు అందించిన దాఖలాలేలేవు. గత ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిలో సగం మందికి కూడా డబ్బులు జమ కాలేదు. దాదాపు రూ.2.25 కోట్ల బకాయిలు ఇక్కడ ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాదికి రూ.8.31 కోట్లతో రాయితీ ప్రణాళిక విడుదల చేశారు. ఏడాది అయినా పూర్తి స్థాయిలో రాయితీ సకాలంలో అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందని రైతులు అంటున్నారు.


బాపట్ల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు ఏళ్ల తరబడి పండించే సంప్రదాయ పంటలను వీడారు. ప్రయోజనకరంగా ఉంటుందన్న అధికారుల మాటలతో ఉద్యాన పంటల వైపు అడుగేశారు. అయితే ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది తప్ప వారికి ప్రకటించిన రాయితీలు అందించడంలో మాత్రం తాత్సారం చేస్తుంది. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయితీకి సంబంఽధించి కేంద్రం కొంత మొత్తం జమ చేస్తుంది. వాటిని కూడా దారి మళ్లించేస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఉద్యాన రైతులకు రాయితీలు పెండింగ్‌లో ఉంది. బాపట్ల జిల్లాలో 28,244 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నట్లు అధికారిక సమాచారం. ఇందులో దాదాపు 17,000 హెక్టార్లలో మిరపే సాగవనుంది. తర్వాత స్థానాల్లో పండ్ల తోటలు 4023 హెక్టార్లలో, కూరగాయలు 3696 హెక్టార్లలో సాగు అవుతున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఉద్యాన పంటలైన జీడిపప్పు, పూలతోటలను రైతులు ఎంచుకుంటున్నారు. ఉద్యాన పంటల సాగు విషయంలో సహజంగా కొంత అధికంగా పెట్టుబడి అవుతుంది. మేలైన విత్తనాల కోసం షేడ్‌నెట్‌, పాలీహౌస్‌ వంటివి ఉపయోగపడతాయి. ఇవేకాక మల్చింగ్‌ షీట్లు కూడా అవసరం. నిమ్మ, జామ, బొప్పాయి, మామిడి, తోటల విస్తరణకు గత ప్రభుత్వం   ఎకరాకు రూ.6 వేల వరకు ప్రోత్సాహం ఇచ్చేది.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీలు భరించేవి. దీనిలో కేంద్రం వాటా 60 శాతం ఉంటే, రాష్ట్రం వాటా 40శాతం. గతంలో కొంతమందికి రాయితీ విడుదల చేసినా వారి సంఖ్య స్వల్పంగానే ఉంది. రాయితీ రూపంలో ఇవ్వాల్సిన మొత్తానికి సీలింగ్‌ పెట్టి డబ్బును ఖాతాల్లో జమ చేశారు. రాయితీల బకాయిలు ఉమ్మడి జిల్లాలో ఉన్నందున కచ్చితమైన మొత్తం అందుబాటులో లేనప్పటికీ దాదాపు రూ.2.25 కోట్లు పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


సకాలంలో కేంద్రం నిధులిచ్చినా..

కేంద్రం తన వాటా నిధులను సకాలంలోనే రాష్ట్ర ఖజానాకు జమ చేస్తుంది. కానీ రాష్ట్రం మాత్రం ఆ నిధులకు మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయడంలేదు. దీంతో కేంద్రం నిధులు తిరిగి వెళ్లిపోతున్న సందర్భాలు ఉన్నాయి. మరి కొన్ని సార్లు రాష్ట్రం ఆ సొమ్ములను వేరే అవసరాలకు మళ్లించడంతో సకాలంలో రైతులకు రాయితీ సొమ్ములు జమకావడంలేదు. దీంతో నెలల తరబడి రాయితీ సొమ్ముల కోసం ఉద్యాన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.  గతంలో రాయితీలను రైతులకు నేరుగా అధికారులే అందించేవారు. కానీ ప్రస్తుతం  సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరుగుతున్నాయి. దీంతో ఎవరికి జమ అయింది, ఎవరికి కాలేదు అనే సమాచారం కూడా సంబంధిత శాఖ వద్ద అందుబాటులో లేదు. మూడేళ్లలో ప్రభుత్వం అందించిన రాయితీలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గత సంవత్సరం మాత్రమే కొద్దిమేర నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అంతకు ముందు రెండేళ్లు కనీస స్థాయిలో కూడా ప్రభుత్వం చెల్లింపులు జరగలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8.31 కోట్లను ఉద్యాన రైతులకు రాయితీలుగా అందించడానికి యంత్రాంగం యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు కోరుతున్నారు.  

Updated Date - 2022-07-19T05:30:00+05:30 IST