బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న సినిమా ‘విక్రమ్ వేద’ (Vikram Vedha). సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. పుష్కర్-గాయత్రి (Pushkar Gayathri) దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’ కు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఉత్తర్ ప్రదేశ్‌లో చేయడానికి హృతిక్ నిరాకరించాడని కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. అతడు అభ్యర్థించడంతోనే ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ లో సినిమా సెట్ వేశారని బీ టౌన్లో పుకార్లు షికార్లు కొట్టాయి. తాజాగా ఈ వదంతులపై నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ స్పందించింది.
పత్రికలు, వెబ్‌సైట్స్‌లో వస్తున్న ఆ వార్తలన్ని తప్పని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా జులై 4న ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘విక్రమ్ వేద షూటింగ్ లోకేషన్స్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ప్రచురితమవుతున్నట్టు మాకు తెలిసింది. ‘విక్రమ్ వేద’ ను ఎక్కువ భాగం లక్నోతో సహా ఇండియాలోనే చిత్రీకరించాం. కొంత భాగాన్ని గతేడాది అక్టోబర్, నవంబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో షూటింగ్ చేశాం. ఆ ఒక్క దేశమే భారీ స్థాయిలో బయో బబుల్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దేశంలో చిత్రీకరణ జరిపాం’’ అని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రకటనను విడుదల చేసింది. ‘విక్రమ్ వేద’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 30న విడుదల కానుంది. హృతిక్ రోషన్ ‘ఫైటర్’ అనే మరో ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది.