Abn logo
Sep 25 2021 @ 02:21AM

ఎంపీపీగా విజయకుమార్‌

ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో నెల్లూరు ఎంపీ, రూరల్‌ ఎమ్మెల్యే

ఉపాధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి

ప్రశాంతంగా ముగిసిన పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక


నెల్లూరు(రూరల్‌), సెప్టెంబరు 24 : నెల్లూరు రూరల్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా మాదరాజుగూడూరు గ్రామానికి చెందిన కాకుపల్లి బిట్‌-2 ఎంపీటీసీ సభ్యుడు బూడిద విజయకుమార్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం  మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ నెల్లూరు రూరల్‌ ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. రిటర్నింగ్‌ అఽధికారి ధనుంజయరెడ్డి, ఎంపీడీవో వసుమతి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. తొలుత నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు 12మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారంతా ఏకగ్రీవంగా ములుముడి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మీరా మొహిద్దీన్‌ను కోఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత  ప్రత్యేకంగా సమావేశమై మాదరాజు గూడూరుకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు బూడిద విజయకుమార్‌ను మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పెనుబర్తి ఎంపీటీసీ పల్లంరెడ్డి రవీందర్‌రెడ్డిని  ఎంపిక చేశారు. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలను అధికారపార్టీయే కైవసం చేసుకోవడంతో పరిషత్‌లో ప్రతిపక్షం లేకుండా పోయింది. 

కాగా నూతనంగా ఎంపికైన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సమావేశానికి ముఖ్యఅతిఽథిగా విచ్చేసిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభినందించారు. వారు మాట్లాడుతూ ఎన్నికైన వారు  ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులతోపాటు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.