విజయవాడ టు విశాఖ

ABN , First Publish Date - 2021-03-04T08:43:48+05:30 IST

గెస్ట్‌ హౌస్‌ ఎక్కడైనా నిర్మించుకోవచ్చు.. హైకోర్టులో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాదన ఇది. ముఖ్యమంత్రి పదమూడు జిల్లాల్లో ఎక్కడైనా క్యాంపు కార్యాలయం

విజయవాడ టు విశాఖ

కార్యాలయాలు ఒక్కొక్కటిగా తరలింపు

తాజాగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ 

న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు

ఇదే తరహాలో మొన్న స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌

ఆర్టీసీ హౌస్‌ తరలింపు వ్యవహారంపై చర్చ


అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గెస్ట్‌ హౌస్‌ ఎక్కడైనా నిర్మించుకోవచ్చు.. హైకోర్టులో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాదన ఇది. ముఖ్యమంత్రి పదమూడు జిల్లాల్లో ఎక్కడైనా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చు..  మీడియాతో పలుమార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్య ఇది. కొత్తగా వచ్చిన ఎండీ విశాఖ బస్‌ కాంప్లెక్స్‌ చూడటానికే వెళ్లారు.. ఆర్టీసీ హౌస్‌ తరలింపు వార్తలపై ప్రజా రవాణా శాఖ ఉన్నతాధికారుల వివరణ ఇది. ఇవన్నీ బయటికి చెబుతున్న మాటలు మాత్రమేనని, లోలోపల కార్యాలయాల తరలింపునకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీనికి రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవోయే తాజా నిదర్శనం. పోలీసు శాఖకు రెండు కళ్లలాంటి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను విజయవాడ నుంచి విశాఖకు తరలిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.. బెజవాడలో రద్దు చేసి అదే మొత్తంతో విశాఖలో ఏర్పాటు చేయాలని పోలీస్‌ బాస్‌కు దిశా నిర్దేశం చేసింది.


సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండాల్సిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని 400 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడమంటే రాజధానిని విశాఖకు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇదొక కీలక ఘట్టంగా స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అక్కడి సీసీ కెమెరాలు లేదా డ్రోన్ల ద్వారా వీడియో ఫుటేజ్‌ తీసుకుని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. అలాంటి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అధికారులు ఉండే ప్రాంతంలో కాకుండా మరోచోట ఏ ప్రభుత్వమూ ఏర్పాటు చేయదు. అందుకు పోలీసు శాఖ కూడా సమ్మతి తెలపదు. గత ప్రభుత్వంలో ఈ సెంటర్‌ ఏర్పాటుకు విజయవాడలో స్థలం ఎంపిక చేసి రూ.13.80 కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రదిపాదన అలా ఆగిపోయింది. తాజాగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విశాఖకు పరిపాలన రాజధానిని మార్చే ఆలోచనలో భాగంగా అంతే మొత్తంతో అక్కడ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. 


ఆర్టీసీ హౌస్‌..

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చిన మొదటి సంస్థ ఏపీఎ్‌సఆర్టీసీ. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ ఖాళీ చేసి, విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ప్రాంగణంలో ఐదంతస్తుల భారీ భవనాన్ని నిర్మించి, 2016లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఒక్కో కార్యాలయం విజయవాడకు రావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఇదే ఆర్టీసీ హౌస్‌లో సమాచార శాఖ, విజిలెన్స్‌, సీఐడీ, రవాణా శాఖ, వెలుగు, సినిమాటోగ్రఫీ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ తదితర కార్యాలయాలకు చోటు లభించింది. ఇదిలావుండగా ఇటీవల ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ విశాఖపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం జగన్‌కు ఆరాధ్య దైవమైన ఒక గురూజీకి నమస్కరించారు. ఆ తర్వాత విశాఖపట్నం ప్రధాన బస్టాండైన ద్వారకా బస్‌ కాంప్లెక్స్‌ను సందర్శించారు. విశాఖ నడిబొడ్డున ఉండే ఈ భవనంలోకి విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌ను తరలిస్తే ఎంత వరకూ అనువుగా ఉంటుందన్న దానిపై అక్కడి అధికారులతో ఎండీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై అధికారులు స్పందిస్తూ కొత్త ఎండీ కావడంతో అవగాహన కోసం చూడటానికి వెళ్లారని వివరణ ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ తరలింపు విషయంలో ఇచ్చిన జీవో నేపథ్యంలో మరోసారి ఆర్టీసీ హౌస్‌ తరలింపు వ్యవహారంపై చర్చ జరుగుతోంది.  

Updated Date - 2021-03-04T08:43:48+05:30 IST