విజయవాడ: మున్సిపల్ ఎన్నికల వేళ బెజవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నానిపై సొంతపార్టీ నేతల మండిపడుతున్నారు. తెలుగు దేశం పార్టీని కేశినేని నాని సొంత జాగీరుగా వాడుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. కేశినేని ఒంటెద్దు పోకడలపై బోండా ఉమా ఇంట్లో అసమ్మతి గళం విప్పారు. బొండా ఉమాతో సమావేశమైన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా.. కేశినేనిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీని కుల సంఘంగా మార్చొద్దన్నారు. ఆదివారం నాడు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు రోడ్ షో నేపథ్యంలో కేశినేని నాని పాల్గొంటే తాము పాల్గొనమని హెచ్చరించారు. టీడీపీ అన్ని వర్గాలదని, చంద్రబాబు తమ అధినాయకుడని, ఏ గొట్టం గాడు తమ అధిష్టానం కాదన్నారు. పార్టీ కోసం తమ పోరాటమని, పదవుల కోసం కేశినేని నాని ఆరాటమన్నారు. మాచర్ల ఘటనలో పార్టీ కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టామని గుర్తు చేశారు. కేశినేని నానిలా చీకటి రాజకీయాలు చేసే నైజం తమది కాదన్నారు. ముఖ్యమంత్రిగా వైస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి తాము పోరాడామని, కేశినేని నాని లాగా పదవుల కోసం కాదన్నారు.