కేబుల్‌ ఆపరేటర్ల చలో విజయవాడ భగ్నం

ABN , First Publish Date - 2021-02-25T05:34:29+05:30 IST

ఏపీ ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లు తమ గోడును చైర్మన దృష్టికి తీసుకెళ్లేందుకు విజయవాడకు వెళుతుంటే బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో కడప నగరం చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫైబర్‌నెట్‌లో ఏబీఎన, టీవీ5 ఛానల్స్‌ ప్రసారాలు నిలిపివేయడంతో

కేబుల్‌ ఆపరేటర్ల చలో విజయవాడ భగ్నం
కడపలో కేబుల్‌ ఆపరేటర్లను అరెస్టు చేస్తున్న పోలీసులు

కడపలో 70 మంది ఆపరేటర్ల అరెస్టు

ఏపీ ఫైబర్‌లో ఏబీఎన, టీవీ5 ఛానల్స్‌ రద్దు

300 ప్యాకేజీలో జెమిని తొలగింపు

రేపు మరే ఛానల్‌ రద్దు చేస్తారో తెలియని పరిస్థితి

ఏబీఎన ఛానల్‌ రావడం లేదని వినియోగదారులు డబ్బులు ఇవ్వడం లేదు

మా గోడు ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ చైర్మనకు వినిపిద్దామని వెళుతుంటే అక్రమ అరెస్టు

ఏపీ కేబుల్‌ ఆపరేటర్ల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి

కడప, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఏపీ ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లు తమ గోడును చైర్మన దృష్టికి తీసుకెళ్లేందుకు విజయవాడకు వెళుతుంటే బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో కడప నగరం చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫైబర్‌నెట్‌లో ఏబీఎన, టీవీ5 ఛానల్స్‌ ప్రసారాలు నిలిపివేయడంతో వినియోగదారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు తదితర సమస్యలను ఏపీ స్టేట్‌ ఫైబర్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) చైర్మన దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. 13 జిల్లాల నుంచి కేబుల్‌ ఆపరేటర్లు వివిధ మార్గాల ద్వారా విజయవాడకు బయలుదేరారు. అందులో భాగంగా కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 300 మందికి పైగా కేబుల్‌ ఆపరేటర్లు ఏపీ కేబుల్‌ ఆపరేటర్ల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో  విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొందరు బస్సుల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. మరో 70 మందికి పైగా ఆపరేటర్లు ఒక బస్సు, మూడు స్కార్పియో వాహనాల్లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో వాహనాలకు డీజిల్‌ పట్టిస్తుండగా చలో విజయవాడ సమాచారాన్ని తెలుసుకున్న చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ, మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకుని కేబుల్‌ ఆపరేటర్లను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, కడప నగర ఆపరేటర్ల ప్రధాన కార్యదర్శి సురేష్‌బాబు, వాసు, రఫి, చైతన్యరెడ్డి, శ్రీకాంత, సుబ్బయ్య, భద్రుడు తదితరులను చిన్నచౌకు పోలీస్‌స్టేషనకు తరలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా నెట్‌, అనలిమిటెడ్‌ టెలిఫోన కనెక్షనతో పాటు 369 ఛానల్స్‌ కేవలం 149 రూపాయలకే ఇచ్చేవారని తెలిపారు. అందులో 150 రూపాయలు కేబుల్‌ ఆపరేటర్లకు కమీషన ఇచ్చేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 149 నుంచి 250 రూపాయలకు ఆ తర్వాత 300 రూపాయలకు పెంచారన్నారు. అంతేకాకుండా ప్రజాదరణ ఉన్న ఏబీఎన ఛానల్‌తో పాటు మరో ఛానల్‌ ప్రసారాలు నిలిపివేశారని, డబ్బులు అడిగేందుకు వెళితే ఏబీఎన రాదు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ వినియోగదారులు అడ్డం తిరుగుతున్నారని వివరించారు. తాజాగా 449, 599 ప్యాకేజీలు పెట్టి 300 ప్యాకేజీలో జెమినిని తొలగించారని, రేపు మరే ఛానల్‌ తొలగిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. అంతేకాకుండా 35 ఏళ్లకు పైగా కేబుల్‌ ఆపరేటర్లుగా జీవనోపాధి సాగిస్తున్న మమ్మల్ని కాదని అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలకు డమ్మీ ఆపరేటర్లుగా కేబుల్‌ నెట్‌ ఇస్తున్నారని, మాకు రావాల్సిన కమీషన 150 రూపాయల నుంచి 100 రూపాయలకు తగ్గించారని ఆవేదన చెందారు. మా సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. మా గోడు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మనకు వినిపిద్దామని జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విజయవాడకు బయలుదేరితే అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పధంతో ఆలోచించి కేబుల్‌ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

Updated Date - 2021-02-25T05:34:29+05:30 IST