విజయవాడ రైల్వే డివిజన్‌కు వరద తాకిడి.. పలు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-11-22T02:26:16+05:30 IST

బెజవాడ రైల్వే డివిజన్‌కు వరద తాకిడి భారీ నష్టాన్ని మిగిల్చింది. డివిజన్‌ పరిధిలోని పడుగుపాడు-నెల్లూరు సెక్షన్‌లో నాలుగుచోట్ల పట్టాలపైకి వరద నీరు

విజయవాడ రైల్వే డివిజన్‌కు వరద తాకిడి.. పలు రైళ్ల రద్దు

విజయవాడ: బెజవాడ రైల్వే డివిజన్‌కు వరద తాకిడి భారీ నష్టాన్ని మిగిల్చింది. డివిజన్‌ పరిధిలోని పడుగుపాడు-నెల్లూరు సెక్షన్‌లో నాలుగుచోట్ల పట్టాలపైకి వరద నీరు చేరడంతో మొత్తం 17 రెగ్యులర్‌ రైళ్లు రద్దయ్యాయి. రైళ్ల పునరుద్ధరణపై డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌ దృష్టి సారించారు. ఆ దిశగా ఇంజనీరింగ్‌ , ఎలక్ర్టికల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌, ఆపరేషన్స్‌ విభాగాలను సమాయత్తం చేశారు. వరద ప్రవాహ ఉధృతి కారణంగా పునరుద్ధరణ పనులు కష్టంగా మారింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. 


బెజవాడ డివిజన్‌ పరిధిలోని నెల్లూరు - పడుగుపాడు సెక్షన్‌లో రైల్వే ట్రాక్‌లపైకి వరద  నీరు ప్రవహించింది. దీంతో మూడు కిలోమీటర్ల పరిధిలో నాలుగు చోట్ల పట్టాల కింద కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. ఈ మార్గంలో వెళ్లే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కొవ్వూరు చెరువు నిండిపోయింది. వరదనీరు నెల్లూరు - పడుగుపాడు సెక్షన్‌లో ట్రాక్స్‌పైకి ఎగదన్నటంతో పట్టాలు దెబ్బతిన్నాయి. కనిగిరి రిజర్వాయర్‌ కాలువ ద్వారా కూడా వరద ప్రవాహం భారీగా ఉండటంతో మొదటి డ్యామేజీకి సమీపంలోనే రెండు పాయలుగా చీలి పట్టాలపైకి ఓవర్‌ ఫ్లో అయింది. కనిగిరి రిజర్వాయర్‌ రెండో పాయ దీనికి సమీపంలోనే మరోచోట పట్టాలను డ్యామేజీ చేసింది. నెల్లూరు ఎగువన క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి వస్తున్న వరదతో మరో రెండు చోట్ల పట్టాలకు డ్యామేజీ వాటిల్లింది. 

Updated Date - 2021-11-22T02:26:16+05:30 IST