విజయవాడలో ఉపాధ్యాయ, ఉద్యోగుల భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-01-25T16:05:29+05:30 IST

విజయవాడ: ఏపీ ఉద్యోగుల ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

విజయవాడలో ఉపాధ్యాయ, ఉద్యోగుల భారీ ర్యాలీ

విజయవాడ: ఏపీ ఉద్యోగుల ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా విజయవాడలో ఉపాధ్యాయ, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. 11వ పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై ఉద్యమంలో వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు.


డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్‌  మోగించారు. నాలుగు జేఏసీలతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలతో కూడిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సోమవారం మూడు పేజీల సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందించారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని స్పష్టంచేశారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు చర్చలకు కూడా రాబోమని తెగేసి చెప్పారు. పీఆర్సీ సాధన సమితిలోని 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఈ నోటీసుతో సచివాలయానికి వెళ్లారు. సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి నోటీసు ఇవ్వాలని భావించగా, ఆయన అప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను ఆయన చాంబరులో కలుసుకుని నోటీసు అందించారు. అంతకుముందు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం సచివాలయంలో జరిగింది. మిగతా ఉద్యోగ జేఏసీలతోపాటు సమ్మెకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - 2022-01-25T16:05:29+05:30 IST