పాత బిల్లుల ‘ఫలహారం’

ABN , First Publish Date - 2020-07-12T15:59:21+05:30 IST

రెండేళ్ల కిందట పూర్తయ్యి నిధులు మంజూరైన పనులకు మళ్లీ..

పాత బిల్లుల ‘ఫలహారం’

ఇంద్రకీలాద్రిపై రూ.3 కోట్ల అక్రమ మాయాజాలం

నిన్న షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో రూ. 65 లక్షలు మాయం

తాజాగా అంతకుమించిన మోసాలు

ఎప్పుడో పూర్తయిన పనులకు ఇప్పుడు కంప్లీషన్ రిపోర్టులట..

డబ్బులు ఎప్పుడో చెల్లించేశామంటున్న అధికారులు

ఇప్పుడు మళ్లీ అన్నింటికీ బిల్లులు.. ఆమోదముద్ర


విజయవాడ(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల కిందట పూర్తయ్యి నిధులు మంజూరైన పనులకు మళ్లీ ఇప్పుడు బిల్లులు పెట్టి ఆమోదముద్ర వేయించుకోవడం మీరెప్పుడైనా చూశారా?, తమ పరిధిలో లేని పనులను తామే కావాలని చేయించినట్టు బిల్డప్‌ ఇచ్చి రూ.లక్షల్లో లాగేయడం ఎక్కడైనా విన్నారా? గతంలో జరిగిన అక్రమ పనులకు గుట్టుచప్పుడు కాకుండా ఇప్పుడు బిల్లులు పెట్టి డబ్బు ఎలా మింగారో మీకు తెలుసా..? ఊహకు కూడా అందని ఇలాంటి అవినీతి ఆలోచనలు జగజ్జనని కొలువుతీరిన ఇంద్రకీలాద్రిపై అధికారులకు వస్తుండటం విచారించాల్సిన విషయం. డబుల్‌ బిల్లింగ్‌తో ప్రభుత్వ ఖజానాకు సున్నం వేస్తూ అమ్మ సన్నిధిలో సాగిస్తున్న అక్రమ వ్యవహారం.  రూ.3 కోట్లను అప్పనంగా మింగేస్తున్న మాయాజాలం. 


లిఫ్ట్‌ పేరుతో రూ.2.30 కోట్లు

మహామండపంలో భక్తుల కోసం నాలుగు లిఫ్టులు ఏర్పాటుచేశారు. వీటి నిర్మాణం పూర్తిచేసి 2018లో ప్రారంభించారు. నిర్మాణం కోసం సుమారు రూ.2.30 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. రెండేళ్ల తర్వాత.. అంటే తాజాగా ఈ పనులు పూర్తయినట్లు కంప్లీషన్‌ రిపోర్టును ఉన్నతాధికారులకు సమర్పించి ఆమోదముద్ర వేయించుకున్నారు. పనులు పూర్తయిన మూడేళ్ల తర్వాత కంప్లీషన్‌ రిపోర్టును ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2016- కృష్ణా పుష్కరాల సమయంలో లిఫ్టుల కోసం నిధులు కేటాయించారని, ఆ నిధులతోనే వాటిని పూర్తిచేశారని సమాచారం. మళ్లీ లిఫ్టుల ఏర్పాటు పేరుతో మరోసారి నిధులు లాగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలా రెండోసారి బిల్లులు చేసుకున్న కంప్లీషన్‌ రిపోర్టులకే ఇప్పుడు ఆమోదముద్ర వేయిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే  గతంలో పనిచేసిన ఈవోలు కంప్లీషన్‌ రిపోర్టులను ఓకే చేయలేదని సమాచారం. కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించాక కంప్లీషన్‌ రిపోర్టులు ఆగమేఘాలపై ఆమోదానికి నోచుకుంటున్నాయి.


సుయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ కోసం రూ.54 లక్షలు

దుర్గగుడిలోని మురుగునీరును శుద్ధిచేసి మొక్కలకు వినియోగించుకునేందుకు సుయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించారు. ఈ పేరుతో సుమారు రూ.54 లక్షలు లాగేశారు. ఈ పనులు ఈవో సూర్యకుమారి హయాంలోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత పద్మ, కోటేశ్వరమ్మ ఈవోలుగా చేశారు. వారి హయాంలో సుయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ కంప్లీషన్‌ రిపోర్టును ఎందుకు పెట్టలేదన్నది ప్రశ్న. ఈ పనులన్నింటిలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకోవడం వల్లే గతంలో పనిచేసిన ఈవోలెవరూ వీటి ఆమోదానికి ముందుకు రాలేదు. పనుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కేవలం కంప్లీషన్‌ రిపోర్టులనే ఇప్పుడు సమర్పించామని ఈఈ భాస్కర్‌ చెబుతున్నారు. పనులన్నీ 2018లోనే పూర్తయ్యాయని అన్నారు. మరి రెండేళ్లపాటు కంప్లీషన్‌ రిపోర్టును ఎందుకు సమర్పించలేదన్న ప్రశ్నకు నిర్ణీత సమయం ఏమీ ఉండదన్నారు.


ఫుట్‌పాత్‌ పనులకు రూ.10లక్షలు

కుమ్మరిపాలెం నుంచి అర్జున వీధి వరకు ఫుట్‌పాత్‌ నిర్మాణం కోసం సుమారు రూ.10 లక్షల ఖర్చు చేసినట్లు బిల్లులు లాగేశారు. వాస్తవానికి జాతీయ రహదారిపై దుర్గగుడి అధికారులు ఫుట్‌పాత్‌ నిర్మించాల్సిన అవసరం లేదు. వీఎంసీ పరిధిలో పూర్తిచేయొచ్చు. అలా కాదని.. దుర్గగుడి నిధులు వెచ్చించడానికి ప్రధాన కారణం అవినీతే. ఈ పనుల్లో అక్రమాలు చోటుచేసుకోవడం వల్లే గత ఈవో హయాంలో కాకుండా ఇప్పటి ఈవో హయాంలో కంప్లీషన్‌ రిపోర్టును పెట్టి ఆమోదముద్ర వేయించుకున్నారు. 


అర్హతలేని ఈవోకు అందలం: జనసేన నేత పోతిన మహేశ్‌ ఆగ్రహం

‘ఇంద్రకీలాద్రిపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావట్లేదు. అర్హత లేని ఈవో సురేశ్‌ను ఎలా కొనసాగిస్తున్నారు. మంత్రి బినామీగా ఉండి అవినీతిలో వాటా మంత్రికి ఇవ్వడం వల్లే కొనసాగిస్తున్నారా?’ అని జనసేన నేత పోతిన మహేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈవో సురేశ్‌ ఓ అవినీతి అనకొండ అని, ఆయన అయినకాడికి దుర్గగుడిని దోచేస్తున్నారన్నారు. దుర్గగుడిలో జరుగుతున్న అవినీతిపై దేవదాయ శాఖ కమిషనర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడో కట్టిన లిఫ్టులను ఇప్పుడు కట్టినట్టు.. అడిషనల్‌ లిఫ్ట్స్‌ పేరుతో సుమారు రూ.2.30 కోట్లు దోచేశారని విమర్శించారు. కుమ్మరిపాలెం నుంచి అర్జున వీధి వరకు ఫుట్‌పాత్‌ నిర్మాణం కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు లాగేశారన్నారు. సుయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం పేరుతో సుమారు రూ.54 లక్షలు నొక్కేశారని, ఈవో అవినీతికి సహకరించడం లేదనే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారని చెప్పారు. 

Updated Date - 2020-07-12T15:59:21+05:30 IST