‘లెజెండ్‌’ ఫ్లైఓవర్‌.. ఘనత ఎవరిది?

ABN , First Publish Date - 2020-10-16T15:01:40+05:30 IST

సాంకేతికంగా ఒక అద్భుతం! వాహనదారులకు ఎంతో సౌకర్యం! ట్రాఫిక్‌ జంఝాటానికి..

‘లెజెండ్‌’ ఫ్లైఓవర్‌.. ఘనత ఎవరిది?

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ‘పోటీ’

నిర్మాణం కోసం విపక్షంగా టీడీపీ ఉద్యమం

కిరణ్‌కుమార్‌ అనుకుని.. చేతులెత్తేశారు!

అధికారంలోకి రాగానే కదిలించిన టీడీపీ

రెండే రెండు నెలల్లో భూసేకరణ పూర్తి

కేంద్ర ప్రాజెక్టు అయినప్పటికీ ప్రత్యేక శ్రద్ధ

కాంట్రాక్టు సంస్థ వెంటబడిన ప్రభుత్వం

ఆర్థిక సహకారం, సిమెంటు, స్టీల్‌ సరఫరా

అనేక సంక్లిష్టతలతో పనుల్లో జాప్యం

అప్పుడే 65 శాతం పనులు పూర్తి

మిగిలిన పనులు వైసీపీ వచ్చాక!


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): సాంకేతికంగా ఒక  అద్భుతం! వాహనదారులకు ఎంతో సౌకర్యం!  ట్రాఫిక్‌ జంఝాటానికి పరిష్కారం! కనకదుర్గ ఫ్లై ఓవర్‌. విజయవాడ నగరానికి ఇదే సరికొత్త నగ. ప్రజల సుదీర్ఘ స్వప్నం శుక్రవారం ఫలిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ‘వర్చువల్‌’ విధానంలో దీనిని ప్రారంభించనున్నారు. అంతా బాగానే ఉంది! ‘ఇది మా ఘనతే’ అంటూ కేంద్ర ప్రభుత్వం కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ప్రత్యేక వీడియో రూపొందించి... జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు సిద్ధమైంది. ‘ఫ్లైఓవర్‌ నిర్మాణం మా హయాంలోనే పూర్తయింది’ అంటూ వైసీపీ కూడా క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక... ఫ్లైఓవర్‌ పనులు మొదలైందే మా వల్ల, ఈ ఘనత మాదే అని తెలుగుదేశం నేతలు చెప్పుకొంటున్నారు! అసలు, పనుల మొదలు నుంచి ఫ్లైఓవర్‌ ప్రారంభం వరకు ఏం జరిగింది? ఎవరి పాత్ర ఎంత? మీరే చూడండి!


ఒకవైపు ఇంద్రకీలాద్రి.. మరోవైపు కృష్ణా నది! మధ్యలో ఇరుకైన రోడ్డు! అదే దారిలో బైకులు, ఆటోలు, కార్లూ, బస్సులూ, లారీలు! ఇక సెలవులు, పర్వదినాల సమయంలో దుర్గగుడికి వచ్చే భక్తుల రద్దీ పెరిగినప్పుడు... బండ్లు కదలని పరిస్థితి. ఈ ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించడానికి దుర్గగుడి మలుపులో ఫ్లై ఓవర్‌ను నిర్మించాలన్న బలమైన కాంక్ష ప్రజల నుంచి దశాబ్దం కిందటే వ్యక్తమైంది. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి నగర ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తీసుకురావటంతోపాటు ఫ్లైఓవర్‌ నిర్మాణంపై దృష్టి సారించారు. ఇది జాతీయ రహదారుల ప్రాజెక్టు కావడంతో... నాటి ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కేంద్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.33 కోట్లు కేటాయిం చింది. ఫ్లై ఓవర్‌కు సంబంధించి సర్వే జరపగా, ఇందుకు భారీగా ఖర్చవుతుందని తేలింది. ఆ తర్వాత ఫ్లై ఓవర్‌ కంటే ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లు అవసరమని లగడపాటి ప్రకటించారు. ఫ్లై ఓవర్‌పై ఫోకస్‌ తగ్గించారు. కానీ... అటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కార్యరూపం దాల్చలేదు. ఇటు... ఫ్లై ఓవర్‌ కూడా కట్టలేదు. 

 

తెలుగుదేశం ఉద్యమం..

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ కోసం టీడీపీ ఉద్యమం చేపట్టింది. ప్రస్తుత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సుదీర్ఘకాలం ఆందోళనలు చేశారు. రాష్ట్ర నేతలను, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా తీసుకొచ్చి ఫ్లై ఓవర్‌ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ ఉద్యమంలో బుద్దా వెంకన్న అనేకసార్లు అరెస్టు కూడా అయ్యారు.  


అధికారంలోకి వచ్చాక కదలిక..

2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తాము ప్రతిపక్షంలో ఉండగా ఫ్లై ఓవర్‌ కోసం కన్న కలలను సాకారం చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఎంపీ  కేశినేని నాని  శ్రమించారు. అనేక మార్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి, ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ఒప్పించారు. మొత్తం వ్యయం రూ.447.80 కోట్లు కాగా, ఇందులో భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.114.59 కోట్లు. ఏ ఒక్క బాధితుడికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో.. టీడీపీ ప్రభుత్వం భారీగా పరిహారం ఇచ్చి మరీ భూ సేకరణ జరిపింది. నిర్వాసితులకు జక్కంపూడిలో జీ-ప్లస్‌ త్రీ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను కేటాయించటంతో పాటు, మెరుగైన నష్టపరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో తక్షణం జమ చేశారు. కేవలం రెండు నెలల్లో భూసేకరణను పూర్తి చేయగలిగారు.


పనులు సాగిందిలా...

అన్ని ఆటంకాలు అధిగమించి ఫ్లై ఓవర్‌ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి... ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు.  కానీ, దీని నిర్మాణంలో సాంకేతిక సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రకటనలు చేశారు. ‘స్పైన్‌ అండ్‌ వింగ్స్‌’ (వెన్నెముకలాంటి ఆధారానికి... రెక్కలవంటి స్పాన్స్‌ను తొడగడం) పద్ధతిలో, పలు మలుపులతో ఇంత పొడవైన ఫ్లై ఓవర్‌ను దేశంలో ఎక్కడా నిర్మించలేదు. ఇది ఆరు లైన్ల ఫ్లై ఓవర్‌. కింద పిల్లర్లు మాత్రం ఒక్కొక్కటే ఉంటాయి.  ఈ సంక్లిష్టతతోపాటు కాంట్రాక్టు సంస్థ అలసత్వం - ఆర్థిక కష్టాలతో ఎప్పటికప్పుడు డెడ్‌లైన్‌ పొడిగిస్తూ వచ్చారు. ఇది కేంద్ర ప్రాజెక్టు అయినప్పటికీ, నాటి సీఎం చంద్ర బాబు దృష్టి సారించారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడిన కాంట్రాక్టు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వాన్సులు ఇచ్చారు. స్టీల్‌, సిమెంట్‌ ఇప్పించారు. దీని ఫలితంగానే పనులు ముందుకుసాగాయి.  స్పాన్‌ నిడివి పెంచడానికి ఆరుచోట్ల పిల్లర్లను దూరం జరపాల్సి వచ్చింది. దీనికోసం ‘వై’ పిల్లర్‌లకు రూపకల్పన చేశారు. ఈ ‘వై’ పిల్లర్ల నిర్మాణానికే రెండేళ్ల సమయం పట్టింది. కేంద్ర డిజైన్‌లో కృష్ణా తూర్పు కాల్వ దిగువ నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం గుండా రాజీవ్‌గాంధీ పార్కు వరకు గోడ నిర్మించాల్సి ఉంది. గోడ  వల్ల కృష్ణానది ఘాట్లు కనిపించవని తలచి.. గోడ బదులు పిల్లర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పటంతో దానికీ గత టీడీపీ ప్రభుత్వం అంగీకరించింది. ఇలాంటి అడ్డంకులు రాకుంటే... టీడీపీ హయాంలోనే ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయ్యేది. 


వైసీపీ వచ్చాక ఇదీ జరిగింది...

గత ఏడాది వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికే ఫ్లైఓవర్‌ 65 శాతం నిర్మాణం జరిగింది. కొంత నిడివిలో వింగ్‌ స్పాన్స్‌ అమర్చడం, మరికొన్ని చిన్న పనులే మిగిలాయి. మిగిలిన 35 శాతం పనులు పూర్తి చేసేందుకు రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పనుల పూర్తికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. అలా మిగిలిపోయిన 35 శాతం పనుల పూర్తికి దాదాపు 15 నెలలు పట్టింది. 


ముచ్చటపడిన నితిన్‌ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ 2015లో ఏపీలో పలు శంకుస్థాపనలకు వచ్చిన సందర్భంలో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ డిజైన్‌ను పరిశీలించారు. ఇది ఆయనను ఆకర్షించింది. తన సొంత నియోజకవర్గం నాగ్‌పూర్‌లోనూ ఇలాంటి ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. దీంతో నాగ్‌పూర్‌లోనూ ఇలాంటి ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శ్రీకారం జరిగింది. ఆ ప్రాజెక్టు ఇప్పటికి 27 శాతం మాత్రమే పూర్తయ్యింది. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ మాత్రం ప్రారంభానికి సిద్ధమైంది. 

Updated Date - 2020-10-16T15:01:40+05:30 IST