కోర్టులోనే తేల్చుకుంటాం

ABN , First Publish Date - 2020-10-01T08:36:52+05:30 IST

విజయవాడ ఎయిర్‌పోర్టు భూముల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. విమానాశ్రయ విస్తరణకు తమ విలువైన భూములు ప్రభుత్వానికి ఇచ్చిన గన్నవరం ప్రాంత రైతులు ఇప్పుడు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు...

కోర్టులోనే తేల్చుకుంటాం


  • ఖరీదైన భూములిచ్చి నష్టపోవాలా? 
  • గన్నవరం ప్రాంత రైతుల మండిపాటు 
  • ఎయిర్‌పోర్టు భూముల వ్యవహారంలో కొత్త మలుపు 
  • సినీ ప్రముఖుల కేసులో ఏఏఐ కౌంటర్‌ దాఖలు 


(అమరావతి, విజయవాడ-ఆంధ్రజ్యోతి)

విజయవాడ ఎయిర్‌పోర్టు భూముల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. విమానాశ్రయ విస్తరణకు తమ విలువైన భూములు ప్రభుత్వానికి ఇచ్చిన గన్నవరం ప్రాంత రైతులు ఇప్పుడు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. మూడు రాజధానుల పేరిట అమరావతిని ఉద్దేశపూర్వకంగా అణచివేయడం ద్వారా ఇప్పటికే రాజధాని గ్రామాల రైతులను వీధుల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తమపట్ల కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై కేంద్ర మాజీమంత్రి యు.కృష్ణంరాజు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ ఇప్పటికే కోర్టు మెట్లెక్కారు. దీంతో రైతులు కూడా మరో వారంలో కేసు వేయాలని భావిస్తున్నారు.


విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం గత ప్రభుత్వం 700 ఎకరాలు సమీకరించింది. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చే రైతులకు కూడా వర్తింపజేస్తామనటంతో రైతులు అంగీకరించారు. వారిలో మూడొంతుల మందికి ప్యాకేజీ ప్రాతిపదికన రాజధానిలో ప్లాట్లు కేటాయించారు. కొంతమందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఆ భూములను ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించటంతో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.


రైతులు ఇచ్చిన భూముల్లో రన్‌వే ఏర్పాటైంది. తాజాగా ఆఫ్రాన్‌తో పాటు, ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తమ భూముల్లో ఉన్న చెట్లు, భవనాలు, బావులు తదితరాలకు సంబంధించి నష్ట పరిహారం కల్పించాలని కోరుతూ సినీ ప్రముఖులు కోర్టును ఆశ్రయించారు. కాగా, ఎల్‌పీఎస్‌ ఒప్పందం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు చెల్లింపు సరిగా లేదు. ఇప్పటి వరకూ 4సంవత్సరాల కౌళ్లలో అన్నింటినీ పొందిన వారు దాదాపుగా లేరు. కొద్దిమందికి మూడేళ్ల వరకూ అందగా, అత్యధికులకు 1, 2 సంవత్సరాలు మాత్రమే వచ్చింది. 3 రాజధానుల ప్రకటనతో రాజధానిలో వీరికిచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానం సైతం నెరవేరలేదు. ప్లాట్లకున్నడిమాండ్‌ పడిపోవడంతో విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 

పోరు కోసం ‘సంఘం’: కొద్దిరోజుల క్రితమే గన్నవరం, పరిసర గ్రామాల రైతులు ‘గన్నవరం రైతుసంక్షేమ సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. భూ సమీకరణ ఒప్పందంలో షరుతుల అమలు కోరుతూ హైకోర్టుకు వెళ్లేందుకు అనుభవజ్ఞులైన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిలోనే మరికొందరు వ్యక్తిగతంగా కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉండగా, విమానాశ్రయం విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో అడ్డుకోవటం తగదని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా తరపున విజయవాడ విమానాశ్రయ అధికారులు కోర్టులో కౌంటర్‌ సమర్పించారు. రూ.600కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కడుతున్నట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-01T08:36:52+05:30 IST