Vijayawada: ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్షాల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-02T16:30:23+05:30 IST

ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి.

Vijayawada: ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్షాల ఆందోళన

విజయవాడ: ఆర్టీసీ చార్జీ(RTC charges)లు తగ్గించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. శనివారం ఉదయం బస్టాండు ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ధర్నాలో సీపీఐ నేత రామకృష్ణ (Ramakrishna), సీపీఎం నేత మధు (Madhu), ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... జగన్(Jagan) ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో పాలన చేస్తుందని విమర్శించారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ ఛార్జీలు పెంచారన్నారు. రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి 2 వేల కోట్ల  భారం మోపారని మండిపడ్డారు. పల్లె వెలుగు బస్సు ఛార్జీలు కూడా పెంచడం దుర్మార్గమన్నారు.


జగన్ అధికారంలోకి వచ్చాక 62 శాతం భారాలు మోపారని తెలిపారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంపుతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘రాష్ట్రాన్ని దివాళా తీయించి.. ప్రజలను దోచుకుంటున్నావు. నీకు తగిన శాస్తి జరిగే రోజు త్వరలో నే వస్తుంది. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుంటే ఏమీ చేయలేరు అనుకుంటున్నావా. త్వరలోనే నీ ప్యాలెస్‌ను ముట్టడిస్తాం, నీకు తగిన బుద్ధి చెబుతాం. త్వరలోనే కలిసి వచ్చే అన్ని పార్టీలతో పోరాటం చేస్తాం’’ అంటూ రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


సీపీఎం మధు మాట్లాడుతూ...  జగన్ మాటలకు, చేతలకు పొంతనే ఉండటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు పై జగన్ ప్రభుత్వం భారాలు మోపిందని విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల పై భారాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీకి దాసోహమై ఏపీలో జగన్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూడా కేంద్రం తప్పులను ప్రశ్నించలేక పోతుందన్నారు. జనంతో జనసేన అన్న పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన పోరాడాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీ నిర్ణయాలపై నిరసన తెలపాలన్నారు. వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చారని మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. జనసేన, టీడీపీ కూడా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించాలని మధు పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-07-02T16:30:23+05:30 IST