విజయవాడ విలవిల

ABN , First Publish Date - 2020-07-13T14:15:05+05:30 IST

జడలు విప్పిన కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది..

విజయవాడ విలవిల

ఒక్క రోజే 206 కరోనా కేసులు

మరో ముగ్గురు మృతి

కొవిడ్ ఆసుపత్రుల్లో పడకలు ఫుల్

మొత్తం కేసులు 2504.. మరణాలు 80

గడిచిన 24 గంటల్లో 25మంది డిశ్చార్జి


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): జడలు విప్పిన కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 206 మందికి వైరస్‌ సోకగా.. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య అధికారికంగా 80కి చేరుకోగా.. పాజిటివ్‌ బాధితుల సంఖ్య 2504కు చేరింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో గడిచిన 24 గంటల్లో 25 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి ఇంతవరకు 1465 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా.. ఇంకా 959 మంది చికిత్స పొందుతున్నారు. 


జిల్లాలో ఈ నెల ఒకటో తేదీ నుంచి కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభించింది. ఈ దెబ్బకు విజయవాడ నగరం విలవిల్లాడిపోతోంది. నగరంలో దాదాపు ప్రతి డివిజన్‌లోనూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 


12 రోజుల్లో 1107 కేసులు 

జిల్లాలో మార్చి 21 నుంచి జూన్‌ 19వ తేదీ వరకు దాదాపు మూడు నెలల కాలంలో మొత్తం 1173  కేసులు నమోదు కాగా, ఈ నెల ఒకటి నుంచి ఆదివారం వరకు 12 రోజుల్లోనే 1107 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం 123 కేసులు రాగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 206 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా కేసులు ఇంత అధికంగా నమోదు కావడం ఇదే తొలిసారి. 

 

కొవిడ్‌ ఆసుపత్రులు కిటకిట  

జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. 400కు పైగా పడకలు కలిగిన విజయవాడ ఆసుపత్రిలో కొత్తగా వస్తున్న రోగులకు మంచాలు ఖాళీ ఉండటం లేదు. దీంతో 60 సంవత్సరాలు దాటిన వారిని.. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులను మాత్రమే ఈ ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. లక్షణాలుపైకి కనిపించకపోతే హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ మందులు వాడాలని చెప్పి పంపించేస్తున్నారు. ఇక 500కు పైగా బెడ్స్‌ ఉన్న గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కొవిడ్‌ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. లక్షణాలు లేని పాజిటివ్‌ బాధితులు తాము ఇచ్చిన కొవిడ్‌ కిట్లను తీసుకుని, హౌస్‌ ఐసొలేషన్‌లో ఉంటూ, వైద్యుల సలహా మేరకు మందులు వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-07-13T14:15:05+05:30 IST