రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ వైసీపీ కార్యకర్త ఆవేదన

ABN , First Publish Date - 2021-10-25T17:09:11+05:30 IST

రెవెన్యూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసిన ఘటన గుడివాడలో చోటు చేసుకుంది.

రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ వైసీపీ కార్యకర్త ఆవేదన

విజయవాడ: రెవెన్యూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసిన ఘటన గుడివాడలో చోటు చేసుకుంది. తన ఆవేదనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు పల్లపు శ్రీనివాస రావు అనే వ్యక్తి గుడివాడ నుండి విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పసమర్రులో తన తల్లి ద్వారా సంక్రమించిన 3 సెంట్ల స్థలాన్ని  ఆక్రమించుకునేందుకు స్థానిక వైసీపీ నాయకుడు ప్రయత్నించాడు. తల్లి మరణించడంతో  భూమి తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌కు శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా లంచం ఇస్తేనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేస్తామన్న చిలకలూరిపేట రెవెన్యూ కార్యాలయ అధికారులు తేల్చిచెప్పారని శ్రీనివాస్ రావు అన్నాడు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండగా 16 నెలల పాటు ఒంటిపూట భోజనం చేశానని చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ గుడివాడ నుండి తిరుపతి పాదయాత్ర చేశానన్నారు. అధికారుల వేధింపులు, అవినీతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సీఎం కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. రెవెన్యూ కార్యాలయ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నాడు. మరోవైపు నిబద్ధతగల కార్యకర్తకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-10-25T17:09:11+05:30 IST