ఫెయిల్యూర్స్‌లో మోదీ, జగన్ పోటీ: సుంకర పద్మశ్రీ

ABN , First Publish Date - 2021-05-13T19:09:37+05:30 IST

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు ఫెయిల్యూర్స్‌లో పోటీ పడుతున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటి సభ్యురాలు సుంకర పద్మశ్రీ వ్యాఖ్యానించారు.

ఫెయిల్యూర్స్‌లో మోదీ, జగన్ పోటీ: సుంకర పద్మశ్రీ

విజయవాడ: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు ఫెయిల్యూర్స్‌లో పోటీ పడుతున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటి సభ్యురాలు సుంకర పద్మశ్రీ  వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన రాహిత్యం వల్ల ప్రజలను కరోనా వైరస్ కభళిస్తోందన్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని మండిపడ్డారు. ‘‘మీ తిప్పలు మీరు పడండని ప్రజలను తీసుకువెళ్లి కరోనా వైరస్‌కు అప్పగించారు’’ అని అన్నారు. కరోనాతో మృతి చెందుతున్న వారిని ఎలాగో కాపాడటం లేదు కనీసం వారి పిల్లలను కాపాడటంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వైరస్ బారిన పడి ,చనిపోయిన వారి పిల్లలకు ఆశ్రయం కల్పించడానికి  ఎన్జీఓలకు అప్పగించడం దారుణమన్నారు. పిల్లల బాధ్యతను ఎన్జీఓలకు అప్పగించడం అంటే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తమ బాధ్యత నుంచి తప్పించుకోవడమే అని వ్యాఖ్యానించారు.


ఎన్జీఓల ఎఫ్‌సిఆర్‌ఎ బ్యాంక్ ఖాతాలను ప్రభుత్వం చాలా వరకు నిలిపివేయడంతో ఎన్జీఓ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయన్నారు. ఖాతాలను నిలిపివేయడం వల్ల వారు విదేశీ నిధులు పొందే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ఎన్జీఓలకు అప్పగించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్జీఓల బ్యాంకు ఖాతాలను పునర్ ప్రారంభించాలని... లేనిపక్షంలో ప్రభుత్వమే ఆ పిల్లల బాధ్యతను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాల సదన్లు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలను తీసుకొని వారిని రాష్ట్ర ప్రభుత్వం  జాగ్రత్తగా చూసుకోవాలని సుంకర పద్మశ్రీ తెలిపారు.

Updated Date - 2021-05-13T19:09:37+05:30 IST