నేరస్థులకు వరంగా మారిన కరోనా

ABN , First Publish Date - 2021-05-12T18:10:18+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ పోలీసులకు భారంగా.. నేరస్థులకు వరంగా మారింది.

నేరస్థులకు వరంగా మారిన కరోనా

విజయవాడ: కరోనా సెకండ్ వేవ్ పోలీసులకు భారంగా.. నేరస్థులకు వరంగా మారింది. గతంలో సమాచారం అందిన మరుక్షణమే పోలీసులు నేరస్థులను వెంటాడి వేటాడి పట్టుకుని స్టేషన్‌కు తెచ్చేవారు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి వారి చేతులకు సంకేళ్లు వేసింది. ఎవరికి కరోనా ఉందో అన్న అనుమానం వెంటాడుతోంది. దీంతో నేరస్థుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇది విజయవాడ పోలీసులు ఎదుర్కొంటున్న విపత్కార పరిస్థితి. ప్రస్తుతం కరోనా విజృంభన తారాస్థాయికి చేరుకుంది. ఎన్ని స్వీయ రక్షణ చర్యలు తీసుకున్నా చాలా మందిని కాటేస్తోంది. ఎలా సోకిందనే విషయం తెలియక కొంతమంది జుట్టుపట్టుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో అనేకమంది ఉద్యోగులను కాటేసింది. ఒకపక్క కరోనా రక్షణ చర్యలు, మరోవైపు కేసుల విచారణ, ఇంకొపక్క నిందితుల అరెస్టు.. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం పోలీసుల్లో మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి.


వారం రోజుల క్రితం ఏపీ, తెలంగాణలోని 37 మంది నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కీలక సూత్రధారిగా విజయవాడకు చెందిన రేఖాశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గుర్తించారు. వారిని 4 రోజులపాటు విచారించారు. తీరా కోర్టులో హాజరు పరిచే సమయానికి షాక్ తగిలింది. వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా రేఖాశ్రీకి పాజిటీవ్ అని తేలింది. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. విచారించిన టీమ్ మొత్తం హోం ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది.

Updated Date - 2021-05-12T18:10:18+05:30 IST