అధికార పార్టీ నేతల చేతిలో ఖాస్రా దస్త్రాల తారుమారు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-25T00:39:33+05:30 IST

ధరణి పోర్టల్‌ లోపాలతో ప్రజలు, పేద రైతులు గుండెలు బాదుకుంటున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ..

అధికార పార్టీ నేతల చేతిలో ఖాస్రా దస్త్రాల తారుమారు: విజయశాంతి

హైదరాబాద్: ధరణి పోర్టల్‌ లోపాలతో ప్రజలు, పేద రైతులు గుండెలు బాదుకుంటున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాష్ట్ర సర్కారు దివాలాకోరు పనితీరును మీడియా కథనాలు బయటపెట్టాయని సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణలోని భూముల చరిత్ర, ప్రభుత్వ, పట్టా భూములు ఏవనేది నిర్ధారించే ఖాస్రా పహాణీలు చాలా జిల్లాల్లో కనిపించపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 


‘‘తాజాగా నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ ఈ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. నిషేధిత భూముల జాబితా (22 ఎ) నుంచి పట్టా భూములను తప్పించేందుకు.. కలెక్టర్ల ఆదేశాలతో జిల్లాల్లో తహసీల్దార్లు దస్త్రాలను తిరగేయగా పలు గ్రామాలకు చెందిన పత్రాల ఆచూకీ లేకపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఖాస్రా దస్త్రాలను అధికార పార్టీ నేతలే కాజేసి రికార్డులను తారుమారు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.’’ అని విజయశాంతి మండిపడ్డారు. 


అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములను, అటవీ భూములను సైతం కబ్జా చేసి పట్టా పొందుతున్న సందర్భాలు కోకోల్లలు ఉన్నాయని ఆమె తెలిపారు. ‘‘భూములకు కీలకమైన ఖాస్రాలను డిజిటలైజ్‌ చేసి ధరణిలో నిక్షిప్తం చేస్తే భూమి స్వభావం తెలుసుకోవడానికి వీలు ఉండి, న్యాయపరమైన వివాదాలు ఏర్పడవని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు. భూముల ప్రక్షాళన పేరిట ప్రజల్ని మభ్యపెట్టి ఖాస్రా దస్త్రాలు లేకుండా మోసం చేస్తున్న ఈ సర్కారును నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి‌పై ఉంది.’’ అని విజయశాంతి తన సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానించారు. 




Updated Date - 2022-01-25T00:39:33+05:30 IST