సీఎంగా ఏం చేశావని ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నావు; కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

ABN , First Publish Date - 2022-02-19T01:23:41+05:30 IST

సీఎంగా ఏం చేశావని ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నావు; కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

సీఎంగా ఏం చేశావని ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నావు; కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేశావని ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నావని కేసీఆర్‌ను బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. తెలంగాణ‌ రాష్ట్రంలో వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతుంటే... సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవ‌డం ఏంటీ? అని విజయశాంతి విమర్శించారు. రాష్ట్రంలో అంత గొప్ప పరిస్థితులు ఏమున్నాయని బర్త్ డే సంబురాలు జరుపుకున్నారు? అని విజయశాంతి ప్రశ్నించారు. ఒకవేళ అంత సంబురంగా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు కదా? అని ఆమె అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి... కేసీఆర్ కుటుంబమే బాగుప‌డింది త‌ప్ప, ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేదని విజయశాంతి విమర్శించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..


''తెలంగాణ‌లో వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతుంటే... సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవ‌డం ఏంటీ?... రాష్ట్రంలో అంత గొప్ప పరిస్థితులు ఏమున్నాయని బర్త్ డే సంబురాలు జరుపుకున్నారు? ఒకవేళ అంత సంబురంగా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు కదా? బంగారు తెలంగాణ అని చెప్పి... కేసీఆర్ కుటుంబమే బాగుప‌డింది త‌ప్ప, ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ఉద్య‌మం పుట్టిందే... నీళ్లు, నిధులు, నియమకాల కోసం. కానీ, కేసీఆర్ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాటిని గాలికొదిలేసి, ప్ర‌జాపాల‌నకు బ‌దులు ఫామ్ హౌస్ పాల‌న చేస్తున్నడు. ప్రజలు బాధల్లో ఉంటే మానవత్వం ఉన్నవారెవరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోరు. కానీ, ఆ దొర‌వారికి పబ్లిసిటీ కావాలి కాబ‌ట్టి, దేశం మొత్తం త‌న ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించి.. త‌నేదో దేశ నాయ‌కుడిలాగా గ‌ప్పాలకు పోతుండు. ఫ్లెక్సీలు పెడితే నాయకులైపోరు కేసీఆర్... వారు జనం గుండెల్లో నుంచి పుట్టాలి. అది నీకు సాధ్యం కాదు. గిరిజ‌నులు త‌మ భూమి పోతుందని ఆందోళ‌న‌లు చేస్తుంటే... అది దొర‌వారికి ప‌ట్టదు. తాను మాత్రం దేశానికి ప్ర‌ధాన‌మంత్రి కావాలి. ముఖ్య‌మంత్రిగా ఏం చేశావని ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నావు కేసీఆర్? రాష్ట్రంలో ఎన్నో స‌మస్య‌లు ఉన్నాయి. అవి ఏం మీకు ప‌ట్టావు. తెలంగాణ వచ్చాక కూడా నియామకాల కోసం.. నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఆత్మబలిదానాలు ఆగడం లేదు.. ఉద్యమాలు తప్పడం లేదు. రాష్ట్రం వచ్చినా తెలంగాణ యువత తలరాత మారలేదు. సీఎం కేసీఆర్... ఇంకెన్ని ప్రాణాలు బ‌లి తీసుకుంటవ్? అని తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తూనే ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కంటే ఘోరంగా తెలంగాణలో కేసీఆర్ స‌ర్కార్ నియంతృత్వ పాలన సాగుతోంది. కేసీఆర్... నీ దుర్మార్గపు పాలనను తెలంగాణ ప్ర‌జలు చూస్తూ ఊరుకోరు. రానున్న రోజుల్లో వారు నీకు త‌గిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-02-19T01:23:41+05:30 IST