Vijayashanthi Satires KTR: అది అవమానమే కేటీఆర్..మరొకటి కాదు

ABN , First Publish Date - 2022-09-29T01:54:23+05:30 IST

ఓటు రాజకీయాలకు బాసర ట్రిపుల్ ఐటీని కూడా వాడుకున్న మంత్రి కేటీఆర్ తీరు చూస్తే అత్యంత హాస్యాస్పదంగా ఉందని ....

Vijayashanthi Satires KTR: అది అవమానమే కేటీఆర్..మరొకటి కాదు

హైదరాబాద్: ఓటు రాజకీయాలకు బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIT)ని కూడా వాడుకున్న మంత్రి కేటీఆర్ (Minister Ktr) తీరు చూస్తే అత్యంత హాస్యాస్పదంగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఎద్దేవా చేశారు. క్యాంటీన్‌లో కుళ్లిన ఆహారం, హాస్టల్‌లో మౌలికసదుపాయాలు లేక నిరసనల్లో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనల్ని అణచివేసేందుకు కరెంట్ కట్ చేసి, సెల్ ఫోన్ వాడకంపై ఆంక్షలు విధించి నానా యాతనలకి గురి చేసింది టీఆరెస్ సర్కార్ అని మండిపడ్డారు. ఒక దశలో విద్యార్థులకు హామీలిచ్చి మాట తప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabithaindra Reddy) ఇంటి దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు కూడా చెయ్యడంతో పరువు పోతోందని భయపడి ఎట్టకేలకి పరిస్థితుల్ని ఏదో కాస్త సరి చేశారని విజయశాంతి అన్నారు. ఆ తర్వాతే మంత్రి కేటీఆర్ అక్కడ అడుగుపెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్టు విద్యార్థుల మధ్య కూర్చుని తాపీగా భోజనం చేసి వెళ్లారని విమర్శించారు. విద్యార్థులవి సిల్లీ డిమాండ్స్ అని సబిత కొట్టిపడేస్తే వాళ్ళ పోరాటం నచ్చిందని, టీవీల్లో చూశానని, ఇది గాంధీగారి సత్యాగ్రహం లాంటిదని కేటీఆర్ ఏవో తప్పించుకునే ముచ్చట్లు చెప్పారన్నారు. 


అసలు ఆ విద్యార్థులు పోరాడిందే టీఆరెస్ (Trs) సర్కారు మీద అని.. వారి తల్లిదండ్రులు మంత్రి సబిత ఇంటికెళ్లి మరీ ఆందోళన చేశారని విజయశాంతి తెలిపారు. తెలంగాణలోనే ఇంత జరిగితే అదేదో బయటెక్కడో జరిగినట్టు టీవీల్లో, పత్రికల్లో చూశానని కేటీఆర్ చెప్పడం కామెడీ కాక ఇంకేంటి? అని ప్రశ్నించారు.  ‘‘కేటీఆర్‌తో కలసి భోజనం చేసిన విద్యార్థులు... మంత్రి వచ్చారు కాబట్టే భోజనం బాగుందనడం ఆయనకి అవమానం తప్ప మరొకటి కాదు. బాసర ట్రిపుల్ ఐటీ పరిణామాలు టీఆరెస్ సర్కారు నిర్లక్ష్య, కర్కశ వైఖరిని బయటపెట్టడమేగాక... అవి మరింత తీవ్రమవుతూ తమ ఓటు బ్యాంకుకి ఎసరు వచ్చే పరిస్థితి కనిపించడంతో కేటీఆర్ పరుగు పరుగున వచ్చి కాకమ్మ కబుర్లు చెప్పి వెళ్లిపోయారు. దేశంలో ఉన్నత విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలని తెలిపే 'నాక్' రేటింగ్స్‌లో బాసర ట్రిపుల్ ఐటీ 'సి' గ్రేడ్‌కు పరిమితమైంది. ఇందుకు కారకులెవరు? ఈ పరిస్థితి మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి.’’ అని విజయశాంతి డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-09-29T01:54:23+05:30 IST