కేసీఆర్ సర్కార్ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి : రాములమ్మ

ABN , First Publish Date - 2021-08-27T03:57:25+05:30 IST

తెలంగాణ‌లో సెప్టెంబర్-01 నుంచి ఆన్‌లైన్ క్లాసులకు స్వస్తి చెప్పి పాఠశాలల్లో..

కేసీఆర్ సర్కార్ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి : రాములమ్మ

హైదరాబాద్ : తెలంగాణ‌లో సెప్టెంబర్-01 నుంచి ఆన్‌లైన్ క్లాసులకు స్వస్తి చెప్పి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.తెలంగాణలో కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిందంటూ సెప్టెంబర్-01 నుంచీ ప్రభుత్వ పాఠశాలలను తెరిచేందుకు రాష్ట్ర సర్కారు ప్రదర్శిస్తున్న దూకుడును చూస్తుంటే ఈ పాలకులకు విద్యార్థుల భవిష్యత్తుపై ఏ మాత్రం పట్టింపు లేదన్న విషయం స్పష్టమవుతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ లాక్ డౌన్ల నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర పాటు మూసి ఉండటంతో ఆ బడుల్లో ఫర్నిచర్ పాడైందని, వర్షాలకు గోడలు, పైకప్పులు నానిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయని, తాగునీరు - మరుగుదొడ్ల సదుపాయాలు కూడా కరవైనట్లు తమ అధ్యయనంలో బయటపడిందని ఉస్మానియా మాజీ డీన్ వెల్లడించిన దిగ్భ్రాంతికర అంశాలను మీడియా కూడా బయటపెట్టింది. ఇది చాలక పలు పాఠశాలలకు కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బడులు తెరవడానికి వారం రోజులు కూడా సమయం లేదు అని రాములక్క విమర్శలు గుప్పించారు.


అసలు ఆ పరిస్థితి ఉందా..!?

ఈ ప్రాథమిక సౌకర్యాలను సరిదిద్దకుండా పిల్లల్ని రప్పిస్తే అసలక్కడ విద్యాభ్యాసం చేసే పరిస్థితి ఉందా?... అనేది ప్రభుత్వం గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలి. మౌలిక సదుపాయాలనే కల్పించలేని ఈ సర్కారు వారు, రేపు బడులు తెరిచాక శానిటైజేషన్, భౌతికదూరం, మాస్కుల ధారణ వంటి విషయాల్లో విద్యార్థుల్ని సక్రమంగా నడిపించగలదా..? అనే సందేహాలు చుట్టుముడుతున్నాయి. అమెరికా అంతటి అగ్రరాజ్యంలోనే బడులు తెరిచిన తర్వాత పిల్లల్లో కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మౌలికసదుపాయాలు కల్పించి, కోవిడ్ నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసేలా పక్కా ప్రణాళిక వేసుకున్న తర్వాతే విద్యా సంస్థలు తెరవాలని తల్లిదండ్రులతో సహా అందరూ కోరుకుంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా తెలంగాణ పాలకులు మొండిగా ముందుకెళితే జరగబోయే పరిణామాలకు సర్కారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని విజయశాంతి తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Updated Date - 2021-08-27T03:57:25+05:30 IST