జలగండంలో కేసీఆర్ కలల విశ్వనగరం... విజయశాంతి

ABN , First Publish Date - 2020-10-16T22:15:02+05:30 IST

జంటనగరాల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన భారీ వర్షాలు

జలగండంలో కేసీఆర్ కలల విశ్వనగరం... విజయశాంతి

హైదరాబాద్: జంటనగరాల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని గతంలో ఎప్పుడూ లేనంత నిస్సహాయ పరిస్థితుల్లోకి నెట్టివేయడం కళ్ళారా చూశామని అన్నారు. వరదనీరు కాలువల్లా పారని వీధి లేదు... ఏరులై ప్రవహించని రోడ్డు లేదని వాపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఏమన్నారంటే.. ‘‘దశాబ్దాల కాలంగా నెలకొన్న ఈ దౌర్భాగ్య పరిస్థితికి గత ప్రభుత్వాలే కారణమని సీఎం కేసీఆర్ దొర గారు ఎన్నోమార్లు నిందించారు. ప్రకృతిని నియంత్రించడం మన వల్ల కాదు కానీ.. చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి రక్షించేందుకు గడచిన మీ ఆరేళ్ళ పరిపాలనా కాలంలో ఏ కాస్తయినా చిత్తశుద్ధితో సేవ చేసి ఉంటే... ఇంత నష్టం జరిగేది కాదు. తక్కువ ఇబ్బందులతో ప్రజలు గట్టెక్కేవారు. వానలు తగ్గినా రోజుల తరబడి కాలనీలకు కాలనీలు నీళ్ళల్లోనే నానే పని ఉండేది కాదు. కరెంట్ కోతలు చాలావరకు తగ్గి ఉండేవి. పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పరిపాలనా కాలంలో ఈ పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందే ఎన్నెన్నో చెరువుల దురాక్రమణ, భూముల కబ్జాలు... అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ పదే పదే అన్నారు. కానీ, జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వెయ్యగలిగారా? మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకున్న మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు’’ అంటూ హైదరాబాద్ నగర్ దుస్థితిపై విమర్శల జల్లు కురిపించారు.



Updated Date - 2020-10-16T22:15:02+05:30 IST