Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 30 2021 @ 17:54PM

కేసీఆర్ సర్కార్‌తో బియ్యం ఎలా కొనిపించాలో తెలుసు: విజయశాంతి

హైదరాబాద్: వరి ధాన్యం కోనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు విజయశాంతి ఖండించారు. వరి ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ మతిస్థిమితం లేనట్లుగా మాట్లాడుతున్నారని, సభ్యత లేకుండా దుర్భాషలాడుతున్నారని విజయశాంతి మండిపడ్డారు. కేంద్రం బియ్యం కొంటామంటుంటే, రాష్ట్రం కొనదని, కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తామని కేసీఆర్ ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్‌తో యాసంగి బియ్యం ఎలా కొనిపించాలో బీజేపీకి తెలుసని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.

ధరణి పోర్టల్ సమస్యలపై విజయశాంతి విమర్శలు 

ధరణి పోర్టల్ సమస్యలపై ఫేస్ బుక్ ట్విట్టర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏరి కోరి రూపొందించిన ధరణి పోర్టల్ పేరెత్తితే చాలు... తెలంగాణ ప్రజలు ఠారెత్తిపోతున్నారు. అసలు గతేడాది అక్టోబర్ నెలలో ఈ పోర్టల్ ప్రారంభించిన తొలి రోజునే గంటల తరబడి, ఆ తర్వాత రోజుల తరబడి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఏ ప్రక్రియా సక్రమంగా ముందుకు సాగక చుక్కలు చూపించి... నేటికి వివిధ సమస్యలతో అలాగే కొనసాగుతోంది. ఈ పోర్టల్‌లోని రకరకాల. సమస్యలపై మీడియాలో కథనాలు రాని రోజంటూ లేనే లేదు. రిజిస్ట్రేషన్లు రద్దయినా మ్యూటేషన్ దరఖాస్తు తిరస్కరణకు గురైనా అందుకోసం ఆన్‌లైన్‌లో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి లేదు. కొన్నిసార్లు ఒక డాక్యుమెంట్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి 2సార్లు చలానా కట్టాల్సి వస్తోంది. అదనంగా కట్టిన సొమ్ము నెలలు గడుస్తున్నా తిరిగి రావడంలేదు.  ధరణిలో స్లాట్‌ క్యాన్సిల్‌ చేసినా అదే పరిస్థితి. రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన అంటూ తీసుకొచ్చిన ఈ ధరణి పోర్టల్ వచ్చి ఏడాది దాటినా... అందులోని సమస్యల గురించి ఎప్పటికప్పుడు మీడియా ద్వారా వెల్లడవుతున్నా... ఇప్పటికీ దానిని సరి చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టేమీ అనిపించడం లేదు. రికార్డుల్లో తప్పులతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు... రెవెన్యూ ఆఫీసులు, మీ సేవా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా రైతుల ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు.’’ అని విజయశాంతి విమర్శించారు. 

పూర్వీకుల కాలం నుంచీ అనుభవిస్తూ, సాగు చేసుకుంటున్న భూముల సమాచారం కూడా మారిపోవడం, ఇతరుల పేరిట నమోదవడం లేదా అసలు వివరాలే లేకుండా పోవడం వంటి సమస్యలతో రైతాంగం నానా అగచాట్లకు గురవుతున్నారని విజయశాంతి వ్యాఖ్యానించారు.  కలెక్టర్లకు వారంవారం గ్రీవెన్స్‌లలో వచ్చే ఫిర్యాదుల్లో ధరణి ఫిర్యాదులే 70 శాతం వరకు ఉన్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. కలెక్టర్ల లాగిన్‌లలో వేలాదిగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కొన్నిచోట్ల 2 నెలల నుంచి పది నెలల వరకు ఫైళ్లు ఆగిపోయాయని రెవెన్యూ వర్గాలే అంటున్నాయని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) సదరు సమస్యల్ని గుర్తించి, వాటికి పరిష్కారాలను కూడా తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. సర్కారు తీరు చూస్తే ఈ నివేదిక ఇప్పట్లో కదిలేలా లేదని అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. 


Advertisement
Advertisement