తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై విజయశాంతి అసంతృప్తి

ABN , First Publish Date - 2021-09-19T01:44:25+05:30 IST

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరుపై బీజేపీ నేత విజయశాంతి సానుకూలంగా స్పందిస్తూ... తెలంగాణలో మాత్రం...

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై విజయశాంతి అసంతృప్తి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరుపై బీజేపీ నేత విజయశాంతి సానుకూలంగా స్పందిస్తూ... తెలంగాణలో మాత్రం వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సిరంజీల కొరత సమస్యగా మారిందని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాములమ్మ పోస్టు యథాతథంగా...


''దేశమంతటా ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ఉచితంగా టీకాలు అందిస్తూ.. ప్రతి రోజు సరికొత్త వాక్సినేషన్ రికార్డు నెలకొల్పుతూ యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్న భారత్... శుక్రవారం ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. రాత్రి 9 గంటల 47 నిమిషాల వరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్ల మందికి పైగా టీకా డోసులు ఇచ్చారు. గత నెల రోజుల వ్యవధిలో ఒకే రోజున కోటికిపైగా డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం ఇది నాలుగోసారి. దీంతో దేశంలో ఇప్పటివరకు టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 79 కోట్లు దాటింది. ఇంతటి ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందనడంలో అతిశయోక్తి లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో తొలి 165 రోజుల్లో కోటి టీకాలు వేయగా... ఆ తర్వాత 78 రోజుల్లో మరో కోటి టీకాలు వేశారు. కానీ ఇంకా టీకాలు వేసేందుకు ఆటంకంగా ఉన్న ఆటో డిజేబుల్ సిరంజీ (ఏడీ)ల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా అలసత్వం వహిస్తూ ప్రజల ఆరోగ్యంపై  శ్రద్ద చూపడంలో విఫలమైంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కేంద్రం పంపిన 21.5 లక్షల వ్యాక్సిన్ నిల్వలు ఉన్నా.. కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు అవసరమైన సిరంజీలు 16 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవి మూడు రోజులకే సరిపోతాయని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో గురు, శుక్రవారాల్లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొన్నిచోట్ల సిరంజీలు లేక నిలిచిన ఉదంతాలు లేకపోలేదు. రాష్ట్రంలో ఇంకా వాక్సిన్ తీసుకొని వారి సంఖ్య చాలా ఉంది. వీరి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారనుంది. కాబట్టి ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై శ్రద్ద చూపి, సరైన అవగాహన కల్పించి, కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత వ్యాక్సిన్‌ను సరైన పద్దతిలో పంపిణీ చేసి కరోనా నుండి రాష్ట్రాన్ని కాపాడితే మంచిది.'' అని విజయశాంతి పేర్కొన్నారు.



Updated Date - 2021-09-19T01:44:25+05:30 IST