Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 23 2021 @ 00:00AM

మళ్లీ మాట తప్పిన కేసీఆర్.. 7ఏళ్లు గడిచినా..: విజయశాంతి

హైదరాబాద్: జిల్లాలో వైద్య సదుపాయాల కొరతపై బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ మాట తప్పారని, ప్రజలను మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. అందులో.. ‘రాష్ట్ర ఏర్పాటు జరిగాక 2014 ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి ఏడేండ్లు దాటినా... ఏ జిల్లాలో కూడా ఆస్పత్రులు అందుబాటులోకి రాలేదు. కిడ్నీ, గుండె జబ్బు లాంటి పెద్ద రోగాలకు జిల్లాల్లో కనీస వైద్యం అందించేవాళ్లు కరువయ్యిన్రు.

పెద్ద రోగం ఏదొచ్చినా ప్రజలు హైదరాబాద్ వరకు పోవాల్సిన దుస్థితి దాపురించింది. కొత్త దవాఖాన్ల సంగతి పక్కనబెడితే ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు, ఎక్విప్ మెంట్ లేక రెండేండ్ల నుంచి గుండె సంబంధిత ఆపరేషన్లు ఆగిపోయాయి. దీంతో రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తుండంతో పేద ప్రాణాలను కాపాడుకోవడానికి ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఆయా సర్జికల్ డిపార్ట్‌మెంట్‌లో 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నవాటిని రాష్ట్ర సర్కార్ భర్తీ చేయకుండా ఏమాత్రం పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తుంది. సీఎం కేసీఆర్ గత ఎన్నికల సమయంలో అనేక సభల్లో మాట్లాడుతూ... ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వరకూ వచ్చేలోగా గుండె జబ్బు పేషెంట్లు మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి 60 కిలోమీటర్లకు ఒక నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొచ్చి.. ఆ మరణాలు లేకుండా చూస్తామని గప్పాలు కొట్టి... ఇప్పటికీ కనీసం ఒక్క జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి తేలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఆయా జిల్లాలో  ఉన్న ఏరియా ఆసుపత్రుల ముందు జిల్లా ఆసుపత్రి అని బోర్డు మార్చేసి.. వాటినే జిల్లా ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పి నాలుగేండ్లు అవుతున్నా ఒక్క ఆసుపత్రిని కూడా జిల్లా ఆసుపత్రి స్థాయిలో అప్ గ్రేడ్ చేయకపోగా... నేషనల్ హెల్త్ మిషన్ కింద అప్‌గ్రేడేషన్  కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మింగేసి.. పేరుకు  కొన్ని ఆసుపత్రుల పనుల్ని నత్తనడకన సాగదీస్తూ వస్తోంది. 

కానీ.. జిల్లాల్లోని ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో స్పెషాలిటీ సేవలను కూడా అందుబాటులోకి తేలేదు. ఇక కొత్త జిల్లాల సంగతి పక్కనబెడితే ఖమ్మం, కరీంనగర్ వంటి పెద్ద ఆసుపత్రులలోనూ డాక్టర్ల కొరత మరింత వేధిస్తున్నా.. సూపర్ స్పెషాలిటీ పోస్టులున్నా.. భర్తీ చేసేందుకు సర్కార్ ఇంట్రస్ట్ చూపించట్లేదు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా.. వీటికి అనుబంధంగా కొత్త దవాఖాన్లను మాత్రం నిర్మించకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న జిల్లా ఆసుపత్రులనే మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులుగా మార్చేసిన్రు. అవి ఇప్పటికీ జిల్లా హాస్పిటళ్ల స్థాయిలోనే ఉండడం గమనార్హం. ఇప్పటికీ వాటిల్లో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లు లేకపోవడమే కాక సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను రిక్రూట్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే 8 మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లు ఉంటాయని ప్రకటించి ఆయా కాలేజీల్లో స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చి సూపర్ స్పెషలిటీ పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ మోసం చేయాలని రాష్ట్ర సర్కార్ చూస్తోంది. ఎప్పటి పబ్బం అప్పుడు గడుపుకునే టీఆర్ఎస్ పాలనకు రానున్న రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో తగిన బుద్ది చెప్పక మానరు’ అని పేర్కొన్నారు.


Advertisement
Advertisement