లోగుట్టు అప్పన్నకెరుక...

ABN , First Publish Date - 2020-10-30T06:24:46+05:30 IST

సింహాచలం దేవస్థానానికి సంబంధించిన పంచ గ్రామాల భూ సమస్య మరో మలుపు తీసుకుంది. ఈ భూ వివాదం పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఒక కమిటీ వేసింది.

లోగుట్టు అప్పన్నకెరుక...

సింహాచలం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కార కమిటీలోకి విజయసాయిరెడ్డి

అనకాపల్లి ఎంపీ సత్యవతికి కూడా స్థానం

విశాఖ ఎంపీ ఎంవీవీని పక్కనపెట్టిన వైనం

అధికార పార్టీలో చర్చనీయాంశం

సాయిరెడ్డి నియామకంపై టీడీపీ అభ్యంతరం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సింహాచలం దేవస్థానానికి సంబంధించిన పంచ గ్రామాల భూ సమస్య మరో మలుపు తీసుకుంది. ఈ భూ వివాదం పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. భూ వివాదం అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ కమిటీలో మరో ముగ్గురిని అదనంగా చేరుస్తూ దేవదాయ శాఖ (రెవెన్యూ) ముఖ్య కార్యదర్శి ఎం.గిరిజాశంకర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతితో పాటు దేవదాయ శాఖ కమిషనర్‌ పేర్లు చేర్చారు. ఇంతకుముందు రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన భీమిలి ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, సీఎం ప్రధాన సలహాదారు, జిల్లా కలెక్టర్‌, దేవస్థానం ఈఓ...సభ్యులుగా కమిటీ వేశారు. ఇప్పుడు ఆ ఐదుగురు కాగా కొత్తగా మరో ముగ్గురు వచ్చారు.


వారికి సంబంధం లేదా?

పంచ గ్రామాల సమస్య నగరంలో అనేక నియోజక వర్గాలతో ముడిపడి ఉంది. విశాఖ తూర్పు, ఉత్తరం, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించినప్పుడు మిగిలిన మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వాలి. కానీ ప్రతిపక్ష సభ్యులైనందున పక్కన పెట్టేశారు. కనీసం విశాఖ ఎంపీకి అయినా కమిటీలో స్థానం కల్పించాలి. పక్కనున్న అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతిని కమిటీలో చేర్చి, అదే పార్టీకి చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను  పక్కనపెట్టడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


విజయసాయిరెడ్డి ఎందుకట?: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

అయితే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఈ కమిటీలో వేయడంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఆయనకు సింహాచలం దేవస్థానంతో ఏమి సంబంధం వుందని కమిటీలో వేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కమిటీలో వేయాలని, అనేక ఆర్థిక కేసుల్లో ఏ-2గా వున్న విజయసాయిరెడ్డిని పేరు చేర్చడం, అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడు దేవస్థానం భూములు కూడా కాజేసే ఆలోచనలో వున్నట్టు దీనిని బట్టి తేటతెల్లమవుతోందన్నారు. కమిటీ నుంచి విజయసాయిరెడ్డిని తక్షణం తప్పించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-30T06:24:46+05:30 IST