గోబ్యాక్‌ కిరణ్‌

ABN , First Publish Date - 2022-05-21T05:56:44+05:30 IST

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు మళ్లీ చేదు అనభవం ఎదురైంది. ‘అర్హులమైనా మాకు పథకాలు ఎందుకు వర్తించరు’ అంటూ గురువారం జి.సిగడాం మండలం ఆనందపురం వాసులు ఆయనను నిలదీసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఇదే మండలం దవళపేట పంచాయతీ విజయరాంపురంలో పర్యటించేందుకు సన్నద్ధమవ్వగా.. గ్రామస్థులతో పాటు సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆయనకు చుక్కెదురైంది.

గోబ్యాక్‌ కిరణ్‌
ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ కాన్వాయిని అడ్డుకున్న విజయరాంపురం గ్రామస్థులు

మా ఊరిలో అడుగుపెట్టొద్దు
ఎచ్చెర్ల ఎమ్మెల్యేను అడ్డుకున్న విజయరాంపురం గ్రామస్థులు
‘గడప గడపకూ ప్రభుత్వం’లో మళ్లీ చేదు అనుభవం
సొంత పార్టీ కార్యకర్తలే నిలదీసిన వైనం
జి.సిగడాం, మే 20:
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు మళ్లీ చేదు అనభవం ఎదురైంది. ‘అర్హులమైనా మాకు పథకాలు ఎందుకు వర్తించరు’ అంటూ గురువారం జి.సిగడాం మండలం ఆనందపురం వాసులు ఆయనను నిలదీసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఇదే మండలం దవళపేట పంచాయతీ విజయరాంపురంలో పర్యటించేందుకు సన్నద్ధమవ్వగా.. గ్రామస్థులతో పాటు సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆయనకు చుక్కెదురైంది. ‘ఏం ఉద్ధరించారని మా గ్రామంలో అడుగుపెట్టారు. హామీలను తుంగలో తొక్కి మా గడప ఎక్కుతారా? ఊరిలో అడుగుపెడితే ఊరుకోం. గోబ్యాక్‌ కిరణ్‌’ అంటూ విజయరాంపురం గ్రామస్థులు, వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకొని సమస్యలపై నిలదీశారు. జగనన్న ముద్దు.. కిరణ్‌కుమార్‌ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చలేక పోవడంతో పాటు తమ నాయకుడు సర్పంచ్‌ అభ్యర్థి, హైకోర్టు న్యాయవాది అయిన పేడాడ శ్రీరామ్‌కు సమాచారం ఇవ్వకుండా గ్రామంలో అడుగుపెడతారా? అంటూ ఆందోళకు దిగారు. బీటీ రహదారికి మరమ్మతులు, ఇంటింటి కొళాయిలు, పక్కా గృహాలు వంటి హామీలు ఏమయ్యాయని  నిలదీశారు. ఏమి చేస్తున్నారని గ్రామాలకు వచ్చి డప్పు కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, విద్యుత్‌, బస్సు చార్జీలు పెంచి సామాన్యుడు నడ్డి విరిచారని దుయ్యబట్టారు.  కనీస మౌలిక వసతులు కల్పించని ప్రభుత్వం ఎందుకన్నారు. పేదలకు, అర్హులకు పథకాలు అందించడంలో మీ చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. గోబ్యాక్‌ కిరణ్‌కుమార్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం  పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే ముందుకు కదిలారు. రెండు, మూడు ఇళ్లను సందర్శించి అగమేఘాలమీద వెనుదిరిగారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వి.మహేశ్వరరావు, జడ్పీటీసీ  సభ్యుడు కె.రమణ, నాయకులు మీసాల వెంకటరమణ, బూరాడ వెంకటరమణ, టి.గౌరీశంకరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 గొడవలు వద్దు.. కూర్చొని మాట్లాడుకుందాం
దవళపేటలో శుక్రవారం మధ్యాహ్నం గడపగడపకూ మన ప్రభుత్వం కార్య క్రమం నిర్వహించేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేశారు. అయితే, అక్కడ కూడా చేదు అనుభవం ఎదురవుతుందని ముందుగానే ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన సర్పంచ్‌ అభ్యర్థి పేడాడ శ్రీరామ్‌కు ఫోన్‌ చేశారు. ఎటువంటి గొడవలు వద్దని, కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నట్లు సమాచారం. దీంతో గ్రామస్థులు శ్రీరామ్‌ ఇంటి వద్ద  సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నేరవేర్చడంతో పాటు  అర్హులకు పథకాలు అందిస్తే మీకు సహకరిస్తామని శ్రీరామ్‌, వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

Updated Date - 2022-05-21T05:56:44+05:30 IST