ఎవరో...అతడెవరో!

ABN , First Publish Date - 2020-09-25T10:51:31+05:30 IST

ఎవరో...అతడెవరో!

ఎవరో...అతడెవరో!

టీడీపీ విజయనగరం అధ్యక్ష పదవిపై అందరి దృష్టి

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నాయకులు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

 ఓవైపు స్థానిక ఎన్నికలు...మరోవైపు అధికార పార్టీ నుంచి వివిధ రూపాల్లో ఎదురవుతున్న సవాళ్లు...ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారనే సంకేతాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను   ప్రకటించేందుకు టీడీపీ అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లా పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.       జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు దూకుడుగా వెళ్తున్నారు. వారిని దీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అధినేత భావిస్తున్నారు. ఈ దిశగా సమర్థులైన నాయకుల కోసం వివిధ మార్గాల్లో అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.


ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేలా ... స్థానికంగా ఉన్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేలా... వ్యూహాత్మకంగా ముందుకెళ్లే నాయకుడు అవసరం. గత ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్‌ చేసిన వైసీపీని వచ్చే స్థానిక ఎన్నికల్లో గట్టిగా ఎదురొడ్డాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ... పార్టీ పరంగా విజయానికి అవసరమైన ఎత్తుగడలు వేయడంలోనూ చురుకుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే స్థాయిలో శ్రేణులనూ ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అఽధ్యక్ష పదవి కీలకంగా మారింది. 


స్థానికమే కీలకం

రాబోయే స్థానిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. పార్టీ బలం నిరూపించుకోవడంతో పాటు జిల్లాలో పట్టును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గత మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా జిల్లాలో కొన్నిచోట్ల టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులు వెనుకంజ వేశారు. మరికొన్ని చోట్ల చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది కేడర్‌ను ఆత్మరక్షణలో పడేసింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అటు శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు...ఇటు నామినేషన్లు వేసేవారికి అండగా నిలిచే పటిష్ట నాయకుడి అవసరం ఉంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ అధినేత చంద్రబాబు...జిల్లా అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కిమిడి నాగార్జున, శివరామకృష్ణ, సువ్వాడ రవిశేఖర్‌లు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరికి పగ్గాలు అందుతాయో...లేక కొత్తవారు తెరపైకి వస్తారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

Updated Date - 2020-09-25T10:51:31+05:30 IST