విజయ శ్రుతి

ABN , First Publish Date - 2022-08-18T07:06:56+05:30 IST

ఆ గాత్రానికి ఆహూతులు సమ్మోహితులై ఈలలు వేస్తే... న్యాయనిర్ణేతలు ముగ్ధులై నూటికి నూరు మార్కులు ఇచ్చారు.

విజయ శ్రుతి

ఆ గాత్రానికి ఆహూతులు సమ్మోహితులై ఈలలు వేస్తే... న్యాయనిర్ణేతలు ముగ్ధులై నూటికి నూరు మార్కులు ఇచ్చారు. అవే ఆమెను ‘జీ-సరిగమప’ విజేతను చేశాయి. సుమధుర గీతాలతో ఆద్యంతం అలరించి... జనహృదయాలను గెలుచుకున్న శ్రుతిక సముద్రాల తన జర్నీ గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు... 


‘‘రవై ఆరు వారాలు... లెక్కకు మించిన వడపోతలు... సుదీర్ఘ నిరీక్షణలు... కానీ ఒక్కరే విన్నర్‌. సవాళ్లు, సంతోషాలు, ఉత్కంఠ క్షణాలు... నిజంగా ఈ ప్రయాణం నాకు ఎంతో నేర్పింది. అంతకు మించి మంచి మిత్రులు, శ్రేయోభిలాషులను ఇచ్చింది. ‘జీ-సరిగమప’లో మొదట నేను అడుగుపెట్టినప్పుడు గెలుస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఇన్నింటిని దాటి... అంతమందితో పోటీపడి... ‘సింగింగ్‌ సూపర్‌స్టార్‌’ టైటిల్‌ దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. దీని వెనుక ఎన్నో ఏళ్ల పరిశ్రమ ఉంది. ఒక కల... దాన్ని సాధించాలన్న బలమైన కోరిక ఉన్నాయి. ముఖ్యంగా మా కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది. నేను పుట్టింది, చదువుకున్నది హైదరాబాద్‌లోనే. ఈ ఏడాదే బీఏ పూర్తయింది. 


సంగీతంతో ప్రయాణం... 

నాకు ఆరేళ్లప్పుడే సంగీతం నేర్చుకోవడం మొదలైంది. నిహాల్‌ కొండూరి గారి దగ్గర కర్ణాటక సంగీతం, కె.రామాచారి గారి వద్ద లలిత సంగీతం అభ్యసిస్తున్నా. పదకొండేళ్లప్పుడు ‘బోల్‌ బేబీ బోల్‌’ రియాలిటీ షోలో పాల్గొన్నాను కానీ... క్వార్టర్‌ఫైనల్స్‌ వరకే వెళ్లగలిగాను. అప్పుడు కూడా జడ్జిగా కోటిసారే. స్కూల్లో, కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా అందులో నా పాటలు తప్పనిసరిగా ఉండేవి. స్నేహితులు, స్టాఫ్‌... అందరూ ప్రోత్సహించేవారు. బాల్యం నుంచి సంగీతంతో కలిసి ప్రయాణిస్తున్నాను. 


తడబడినా... 

ఇక ‘సరిగమప’లో అయితే ఆరంభంలో తడబడ్డాను. ఒక దశలో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయాను. ఇక అక్కడి నుంచి కోలుకోవడం కష్టం అనుకున్నాను. ఆరంభంలోనే అలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో ఏదో ఆందోళన... ఒత్తిడి. కానీ వెంటనే దాని నుంచి బయటకు వచ్చేశాను. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. ఒక సవాలుగా తీసుకున్నా. ఆ తరువాతి ఎపిసోడ్‌లో వందకు వంద మార్కులు తెచ్చుకున్నా. ‘గోల్డెన్‌ సీట్‌’లో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ వెళ్లాను. 


అవే గెలిపించాయి... 

ఇంతటి సుదీర్ఘ పోటీలో ప్రధానంగా కావల్సింది మనపై మనకు నమ్మకం, ఓర్పు. అవే నన్ను గెలిపించాయి. ప్రతిసారీ అంతకు ముందు పాడిన దానికంటే ఈసారి బాగా పాడాలనుకునేదాన్ని. షో నడుస్తున్న కొద్దీ నాపై నాకు నమ్మకం పెరిగింది. టైటిల్‌ కోసమే పోటీపడాలనుకుని ప్రయత్నించాను. ఇక్కడ సంగీతంతో పాటు వేదికపై మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాం... మనల్ని మనం ఎంత బాగా ప్రజెంట్‌ చేసుకోగలుగుతున్నాం... అన్నవి కూడా ముఖ్యం. అలాగే బాడీలాంగ్వేజ్‌ కూడా! నాకు మెంటార్లుగా ఉన్న గీతా మాధురి అక్క, శ్రీకృష్ణ, పృధ్వీ, రేవంత్‌, సాకేత్‌ అన్నల నుంచి ఇలాంటివెన్నో విషయాలు నేర్చుకున్నా. వాళ్లు కూడా ఇలాంటి షోల నుంచి వచ్చినవారే కదా! 


మధురానుభూతి... 

ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుల సమక్షంలో పాడడం అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. అన్నిటికంటే నాకు సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన సందర్భం... కోటి గారి నుంచి అభినందనలు అందుకోవడం. సెమీ్‌సలో ‘అరుంధతి’ చిత్రంలోని ‘భూ భూ భుజంగం’ పాట పాడాను. అది విని కోటి గారు ముగ్ధులైపోయారు. వేదిక పైకి వచ్చి... ‘చాలా అద్భుతంగా పాడావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ ఆశీర్వదించారు. అంతటి ప్రసిద్ధ సంగీత దర్శకుడి నుంచి ఆ ప్రశంస పొందడం నాకు ఒక గొప్ప అనుభూతి. రన్నర్‌పగా నిలిచిన వెంకట సుధాన్షు కూడా ఎంతో అద్భుతంగా పాడాడు. నాపై నాకు నమ్మకం, ప్రతిదీ సవాలుగా తీసుకొని కష్టపడడం... ఇవే నా బలాలు. 

హనుమా 


బాలు స్ఫూర్తి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ పెరిగాను. ఆయనే నాకు స్ఫూర్తి. ఒకే ఒక్కసారి బాలు గారిని కలిశాను. కానీ మాట్లాడే అవకాశం రాలేదు. అలాగే చిత్ర, శ్రేయా ఘోషల్‌ పాటలన్నా చాలా ఇష్టం. నటుల్లో నాని, అనుష్క ఇష్టం. ప్రస్తుతం మణిశర్మ గారి చిత్రంలో పాడాను. కోటి గారు ఈ అవకాశం ఇప్పించారు. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే... మంచి సంగీత దర్శకుల సినిమాల్లో కలకాలం గుర్తుండిపోయే పాటలు పాడాలి. మంచి గాయనిగా పేరు సంపాదించుకోవాలి. 



Updated Date - 2022-08-18T07:06:56+05:30 IST