సూపర్‌ బేజారు

ABN , First Publish Date - 2022-05-14T06:15:32+05:30 IST

సూపర్‌ బేజారు

సూపర్‌ బేజారు
బందరురోడ్డులోని విజయకృష్ణా సూపర్‌ బజార్‌

కనుమరుగవుతున్న విజయకృష్ణా సూపర్‌ బజార్‌ 

నగరంలోని ఆరు బ్రాంచిలు మూసివేత

మిగిలింది బందరురోడ్డులోని ప్రధాన కాంప్లెక్సే

క్రమంగా తగ్గిపోతున్న వ్యాపారం

ప్రభుత్వం నుంచి మద్దతు లేదు.. అప్పూ రాదు..

బకాయిల బండ, పాలకవర్గాల స్వార్థం

చివరికి కనుమరుగయ్యే పరిస్థితి


విజయకృష్ణా సూపర్‌ బజార్‌.. విజయవాడలోని మొదటి మూడక్షరాలు, ఉమ్మడి కృష్ణాలోని రెండక్షరాల నామధేయం కలిగిన ఈ సూపర్‌ బజార్‌ ఒకప్పటి బ్రాండ్‌. దశాబ్దాల కిందటే సూపర్‌ మార్కెట్లకు నాంది పలికిన సంస్థ. కానీ, నేడు మూతపడే దిశగా అడుగులు వేస్తోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగానే.. ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉండటం, పాలకవర్గాల స్వార్థ ప్రయోజనాలు, నగరంలో హోల్‌సేల్‌ మాల్స్‌, మార్కెట్లతో పోటీ పడలేకపోవడం, కాంప్లెక్సులో ప్రైవేట్‌ మాయాజాలం.. కారణంగా ఎంతో చరిత్ర కలిగిన ఈ సూపర్‌ బజార్‌ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయకృష్ణా సూపర్‌ బజార్‌కు చెందిన ఆరు బ్రాంచిలు ఇప్పటికే మూతపడ్డాయి. కనీసం చైర్మన్‌ కూడా దీనివైపు చూసే పరిస్థితి లేకపోవడంతో బందరురోడ్డులోని ప్రధాన బ్రాంచ్‌ మనుగడ కూడా కష్టంగానే మారింది. నిత్యావసరాలు, ఫ్యాన్సీ ఐటమ్స్‌తో పాటు కొనుగోలుదారులు కూడా లేక క్రమంగా కునారిల్లుతోంది.

శాఖోపశాఖలుగా విస్తరించి..

విజయకృష్ణా సూపర్‌ బజార్‌ 1963లో ఏర్పడింది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవస్థానమైన కనకదుర్గమ్మ ఆలయానికి కూడా అప్పట్లో ఐఏఎస్‌ అధికారి ఉండేవారు కాదు. కానీ, విజయకృష్ణా సూపర్‌ బజార్‌కు ఐఏఎస్‌ అధికారి ఉండేవారు. ప్రభాకరరెడ్డి ఐఏఎస్‌ అధికారిగా ఉన్నప్పుడు అభివృద్ధిలో పరుగు పెట్టింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. భవానీపురం, గాంధీనగర్‌, సత్యనారాయణపురం, కేదారేశ్వరపేట, మాచవరం, బెంజిసర్కిల్‌ (రింగ్‌రోడ్డు బ్రాంచ్‌)లో తన శాఖలను ప్రారంభించింది. 

ప్రభుత్వాల నిర్లక్ష్యం.. పాలకవర్గాల అలక్ష్యం..

నగరంలో హైపర్‌ మార్కెట్స్‌, సూపర్‌ మార్కెట్స్‌ ప్రవేశించే వరకు విజయకృష్ణాకు తిరుగు లేదు. ఆ తరువాత పతనం మొదలైంది. ప్రభుత్వం నుంచి సహకారం లోపించింది. దీంతో వ్యాపారం భారీస్థాయిలో చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పనిచేసే సిబ్బందిలో చాలామంది పదవీ విరమణ పొందడం, మృతిచెందటం, ఖాళీ అయిన పోస్టులు భర్తీ కాకపోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం 1963లో ఏర్పడిన ప్రధాన బ్రాంచి మాత్రమే మిగిలి ఉంది. 

కమర్షియల్‌ మాయాజాలం

బందరు రోడ్డులో రాఘవయ్య పార్కు పక్కనే ఉన్న ఈ సూపర్‌ బజార్‌ కాంప్లెక్సులో గత మూడు దశాబ్దాలుగా ప్రైవేట్‌ సంస్థలు వ్యాపారం చేసుకునేందుకు అవకాశమిచ్చారు. విజయకృష్ణా పేరుతో పోర్కు, పెట్‌ డాగ్స్‌, అక్వేరియమ్స్‌ దుకాణాలకు అనుమతులిచ్చారు. ఆ తరువాత కన్వెన్షన్‌ సెంటర్‌, సైకిల్‌, లైటింగ్‌, మెడికల్‌, ఫ్యాన్సీ షాపులకు అవకాశం ఇచ్చారు. దీంతో కాంప్లెక్సులో విజయకృష్ణా కుంచించుకుపోతూ వచ్చింది. ప్రైవేట్‌ సంస్థల ఆధిపత్యం ఎక్కువైంది. నెలకు రూ.లక్షన్నర అద్దె చెల్లించేలా కన్వెన్షన్‌ సెంటరును లీజుకు ఇచ్చారు. వాస్తవానికి ఈ కన్వెన్షన్‌ సెంటరును ఒకసారి నిర్వాహకుడు అద్దెకు ఇచ్చినా రూ.లక్ష వస్తుంది. నెల మొత్తంమీద దాదాపు రూ.30 లక్షలు వస్తుంది. అదే విజయకృష్ణా నేరుగా చేపట్టినా భారీ ఆదాయం వచ్చేది.

కారణాలనేకం..

- ఈ సూపర్‌ బజార్‌ వ్యాపారం చేయలేకపోవటానికి ప్రభుత్వం నుంచి మద్దతు కరువవడం ఒక కారణమైతే, ప్రభుత్వ శాఖల నుంచి బిల్లులు రాకపోవడం మరో కారణం. ఈ బిల్లులే ప్రస్తుతం రూ.కోటిన్నర పైగా ఉన్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా క్యాంపు కలెక్టరేట్‌ నుంచి రావాల్సిన స్టేషనరీ బిల్లు రూ.35 లక్షలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ), ఎన్నికల స్టేషనరీ, ఇతర ప్రభుత్వ శాఖల బిల్లులు కూడా రావట్లేదు.  

- ఒకప్పుడు నిత్యావసరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌ చేసి ఇక్కడే సొంతంగా ప్యాకింగ్‌ చేసేవారు. ఇందుకోసం భారీ యంత్రాన్ని కూడా కొన్నారు. ప్రస్తుతం అది పనిచేయట్లేదు. బాగు చేయించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో 30 మంది సిబ్బందితో అరకొరగా ప్యాకింగ్‌ చేయిస్తున్నారు. 

- ఒకప్పుడు ప్రభుత్వ శాఖల నుంచి ప్రైవేట్‌ సంస్థల వరకూ ఆర్డర్లు బాగా ఉండేవి. సొంతంగా మార్కెటింగ్‌ విభాగం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థల నుంచే ఆర్డర్లు కరువయ్యాయి.  

ఉద్యోగుల పరిస్థితి ఏంటి?

సూపర్‌ బజారులో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు తప్ప ఉద్యోగులకు ఇప్పటికీ రూ.11 వేల కంటే గరిష్టంగా వేతనాలు లేవు. వచ్చిన ఆదాయం నుంచే జీతాలు పెంచుకోవాలి. ఆదాయం లేకపోవటంతో జీతాల పెరుగుదల లేదు. సహకార శాఖ పరిధిలో పనిచేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. 





Read more