పాడి రైతుల అభివృద్ధే విజయ డెయిరీ లక్ష్యం

ABN , First Publish Date - 2021-11-30T06:46:09+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల అభివృద్ధికి దోహదపడడమే కృష్ణ మిల్క్‌ యూనియన్‌ విజయ డెయిరీ లక్ష్యమని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు.

పాడి రైతుల అభివృద్ధే విజయ డెయిరీ లక్ష్యం
మాట్లాడుతున్న ఆంజనేయులు

చైర్మన్‌ చలసాని ఆంజనేయులు 

ముండ్లమూరు, నవంబరు 29 : గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల అభివృద్ధికి దోహదపడడమే కృష్ణ మిల్క్‌ యూనియన్‌ విజయ డెయిరీ లక్ష్యమని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. సోమవారం మండల కేంద్రం ముండ్లమూరులో ఆ సంస్థ పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు పోషకులను ఉద్దేశించి చైర్మన్‌ మాట్లాడుతూ డెయిరీ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. పాల ఉత్పత్తి దారులకు అనేక సంక్షేమ కార్యక్రమాలతో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో తొలిసారిగా ముండ్లమూరులోనే విజయ డెయిరీని ప్రారంభించామన్నారు.  ఈ ప్రాంత రైతులను కూడా అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటికే కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో తమ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి రోజు రెండు లక్షలు లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ డెయిరీలన్నింటి కంటే తమ డెయిరీ పాడి రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తోందన్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇప్పటికే రూ 650 కోట్లు బోన్‌సగా రైతులకు అందించినట్లు తెలిపారు. ప్రధానంగా సన్న, చిన్న కారు రైతులకు బోనస్‌ ఇస్తున్నామన్నారు. ఇన్సూరెన్స్‌లతో సంబందం లేకుండా విజయ డెయిరీకి పాలు పోసి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 15 రోజుల్లోపే యూనియన్‌ నిధి నుంచి రూ 50వేలు ఇస్తున్నట్లు తెలిపారు. విజయ డెయిరీ ద్వారా ఇన్సూరెన్స్‌తో పాటు పశుపోషకులకు దాణా, గడ్డి కోత యంత్రాలతో పాటు గేదెలు కొనుగోలు చేసుకొనేందుకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.  ప్రస్తుతం ముండ్లమూరుతో పాటు రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో అనేక ప్రాంతాల్లో విజయ డెయిరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 1.50 లక్షల పాడి కుటుంబాలు విజయ డెయిరీలో కుటుంబ సభ్యులుగా చేరారన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వర్‌బాబు, జనరల్‌ మేనేజర్‌ జీ.అనీల్‌ కుమార్‌, ఎనుముల శ్రీనివాసరెడ్డి, కుమ్మెత నాగమల్లేశ్వరరావు, పుచ్చ రవీంద్రారెడ్డి, భాను ప్రకా్‌షరెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ సూదిదేవర అంజయ్య, మాజీ సర్పంచ్‌ చింతా శ్రీనివాసరెడ్డి, నాయుడుపాలెం ఎంపీటీసీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, సర్పంచ్‌ గొర్రె శ్రీదేవి రాముడు, గూడాల సుబ్బారెడ్డి, కొడిమెల శ్రీనివాసరావు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T06:46:09+05:30 IST