కోలీవుడ్ విలక్షణ నటుడు.. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పాత్రల పరంగా ఎలాంటి పరిమితులు పెట్టుకోవడం లేదు. కాంబినేషన్ నచ్చి, కాల్షీట్స్ ఖాళీగా ఉంటే చాలు.. ఎలాంటి పాత్రకైనా సై అంటున్నాడు. ‘ఉప్పెన (Uppena), మాస్టర్ (Master), విక్రమ్ (Vikram)’ చిత్రాల్లో అతడు చూపించిన విలనిజం నభూతో నభవిష్యతి అన్నరీతిలో ఎస్టాబ్లిష్ అయింది. దాంతో అతడి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఒక్క పక్క హీరోగా.. నచ్చిన కథాంశంలో నటిస్తూనే.. మరో పక్క విలన్ గానూ తనలోని సరికొత్త నటుడ్ని తట్టిలేపుతున్నాడు. అయితే కొంతకాలంగా అతడు హీరోగా ఫెయిలవుతూ.. విలన్ గా చెలరేగిపోతున్నాడు. అందుకే దర్శకనిర్మాతలు ప్రస్తుతం అతడిలోని విలన్ నే నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే అతడి కోసం ప్రత్యేకమైన పాత్రలు వండుతున్నారు.
తాజాగా షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తో తమిళ దర్శకుడు అట్లీ (Atlee) తెరకెక్కిస్తున్న ‘జవాన్’ (Jawan) సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆల్మోస్ట్ ఓకే అయినట్టేనని, షారుఖ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇంతకు ముందెన్నడూ బాలీవుడ్లో చూడని విధంగా అతడి విలన్ పాత్రను రాసుకున్నాడట అట్లీ. దానికి ఆషామాషీ నటులైతే పాత్ర పండదని.. దర్శకుడు విజయ్ సేతుపతిని ప్రత్యేకించి విలన్ గా ఎంపిక చేశాడని తెలుస్తోంది. షారుఖ్ లాంటి బాద్షా సినిమాలో అవకాశం వస్తే .. వద్దనే ఛాన్సేలేదు.
‘పుష్ప 2’ (Pushpa 2) లో సైతం విజయ్ సేతుపతి కోసం సుకుమార్ (Sukumar) ప్రత్యేకమైన ట్రాక్ రాసుకున్నాడని, ఇప్పటికే మైత్రీ కాంపౌండ్ నుంచి లీకైంది న్యూస్. నిజానికి మొదటి భాగంలోనే విజయ్ సేతుపతిని తీసుకోవాలని సుక్కు భావించాడు. అయితే అది వర్కవుట్ కాలేదు. అతడి స్థానంలోకి ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) వచ్చి ఆలోటును అద్భుతంగా భర్తీ చేశాడు. ఇప్పుడు ఫహద్ పక్కన విక్రమ్ తరహాలో కాంబోని సెట్ చేస్తే అల్లు అర్జున్తో ఢీకొట్టే ఎపిసోడ్స్ ‘కేజీఎఫ్ 2’ (KGF2) రేంజ్ లో పేలతాయని సుకుమార్ టీమ్ భావిస్తోందట. అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఇలా విజయ్ సేతుపతి విలన్ పాత్రలు ఓకే అయితే.. అభిమానులకు డబుల్ ధమాకానే.