న్యాయ ప్రక్రియ పూర్తి.. ఏ క్షణమైనా భారత్‌కు విజయ్‌మాల్యా..

ABN , First Publish Date - 2020-06-03T19:50:39+05:30 IST

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు తరలించేందుకు రంగం...

న్యాయ ప్రక్రియ పూర్తి.. ఏ క్షణమైనా భారత్‌కు విజయ్‌మాల్యా..

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో.. ఏ క్షణమైనా ఆయనను దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. ‘‘వచ్చే కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా మేము మాల్యాని భారత్‌కు తరలించవచ్చు..’’ అని ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి మీడియాకు వెల్లడించారు. అయితే ఏ తేదీన మాల్యా తరలింపు ఉంటుందన్న దానిపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు. ‘‘విజయ్ మాల్యా యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన తరలింపునకు సంబంధించిన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేశాం..’’ అని ఆయన పేర్కొన్నారు.


కాగా విజయ్ మాల్యాను భారత్‌కు తరలించే విషయమై సీబీఐ, ఈడీ అధికారులు యూకేలో ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. తొలుత తామే కేసు నమోదు చేశాం కాబట్టి... మాల్యా భారత్‌కు రాగానే ముందు మేమే కస్టడీలోకి తీసుకుంటాం..’’ అని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్ల రుణాలకు సంబంధించి విజయ్ మాల్యా మోసం, మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-06-03T19:50:39+05:30 IST