Jun 14 2021 @ 19:15PM

డబూ రత్నాని క్యాలెండర్‌లో తొలిసారి సౌత్‌ హీరోకి స్థానం

తొలిసారి సౌత్‌ హీరో.. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో చోటు సంపాదించాడు. ఎవరా సౌత్‌ హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు.. 'లైగర్‌', రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల టైమ్స్‌ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మేన్ లిస్ట్‌లో మూడోసారి టాప్‌ ప్లేస్‌లో నిలిచి విజయ్ దేవరకొండ తన క్రేజ్‌ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. యూత్‌లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్.. ఇప్పుడు మరో క్రేజీ న్యూస్‌లో నిలిచాడు. బాలీవుడ్ స్టార్‌ల సరసన డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్ కనిపించాడు. సౌత్ ఇండియా నుంచి ఈ క్యాలెండర్‌లో చోటు దక్కించుకున్న మొదటి హీరో ఈ రౌడీనే కావడం విశేషం. ఇప్పటి వరకు విజయ్‌ దేవరకొండ చేసింది కేవలం 9 సినిమాలే. వాటికే నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించడం విశేషమనే చెప్పుకోవాలి. ఈ క్యాలెండర్‌కు సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ అదిరిపోయేలా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్‌తో ఇన్‌స్టా వేదికగా లైవ్‌లో ముచ్చటించాడు డబూ.


ఈ లైవ్‌ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘‘ఈ ఫొటో షూట్ చాలా తొందరగా, చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుంచి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్‌లో కనిపించారు. నేను షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్‌లో చూశా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటినుంచి నాకు మీ క్యాలెండర్‌లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఫైనల్‌గా నా కోరిక తీరింది.." అన్నారు.


డబూ రత్నాని మాట్లాడుతూ.. ''థాంక్యూ విజయ్ దేవరకొండ.. నా క్యాలెండర్‌లో డెబ్యూ చేసినందుకు. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేశాను. నా క్యాలెండర్‌లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే.. థాంక్యూ’’ అన్నారు.