Advertisement

Liger: రిలీజ్‌ డేట్‌‌ ప్రకటన ఆలస్యానికి కారణం చెప్పిన రౌడీ!

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్ర రిలీజ్ డేట్ ఆలస్యానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ తెలియజేశారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్‌‌కి సంబంధించి థియేటర్లు తెరుచుకునే విషయంపై ఇటీవల ఓ క్లారిటీ రావడంతో.. పాన్ ఇండియా చిత్రాల మేకర్స్ వరుసగా తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. కానీ ‘లైగర్’ రిలీజ్ విషయంలో మాత్రం ఇంత వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎందుకు విడుదల తేదీ ప్రకటన రాలేదో.. తాజాగా విజయ్ దేవరకొండ తెలిపారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘విడుదల తేదీ ప్రకటన విషయంలో మేము టైమ్ తీసుకుంటున్న మాట వాస్తవమే. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము. అయితే ఎందుకు టైమ్ తీసుకుంటున్నామంటే.. సినిమాకు సంబంధించి యుఎస్‌లో రెండు వారాల పాటు షూటింగ్ జరపాలి. అందుకు వీసాల కోసం ఎదురుచూస్తున్నాము. ఈ షెడ్యూల్‌లో మైక్ టైసన్ గారితో షూట్ చేయాలి. వీసాలకు అనుమతి వచ్చిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాము. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది..’’ అని తెలిపారు. 

Advertisement