Jul 30 2021 @ 18:28PM

రాజ్‌తరుణ్ సినిమాకు రౌడీ హీరో సపోర్ట్

హీరో రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమేడియన్‌గా నటిస్తోన్న చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. సాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో ఫీల్‌ గుడ్‌ రొమాన్స్‌ కామెడీ మూవీగా రూపొందుతోంది. డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నందకుమార్‌ అభినేని, భరత్‌ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ‘అలా ఇలా అనాలని’ అనే సాంగ్‌ని రౌడీ హీరో విజ‌య్‌ దేవ‌ర‌కొండ విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అలా ఇలా అనాల‌ని ఇలా ఎలా ఉందే.. అవీ ఇవీ వినాల‌ని ఇవాల‌తో చిందే..’ అంటూ సాగే ఈ పాట‌కు అనంత శ్రీ‌రామ్ సాహిత్యం అందించ‌గా స్వీకర్‌ అగస్తి స్వ‌ర‌ప‌రిచారు. స‌త్య యామిని, స్వీక‌ర్ అగ‌స్తి సంయుక్తంగా ఆల‌పించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతోంది. రాజ్‌తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వెన్నెలకిషోర్, మురళీశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్‌, మధురిమ తదితరులు ఇతర తారాగణం.