శరవేగంగా!

ABN , First Publish Date - 2022-08-19T05:11:01+05:30 IST

పరిశ్రమల స్థాపనకు జిల్లా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

శరవేగంగా!

  • జోరుగా పరిశ్రమల ఏర్పాటు
  • టీఎ్‌స-ఐపా్‌సతో సత్వర అనుమతులు
  • పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికుల ఆసక్తి 
  • ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు
  • ప్రత్యక్షంగా.. పరోక్షంగా నిరుద్యోగులకు ఉపాధి 


పరిశ్రమల స్థాపనకు జిల్లా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అనేక సంస్థలు ఇక్కడ ఇండస్ర్టీస్‌ ఏర్పాటు చేస్తుండటంతో జిల్లా  అభివృద్ధిలో దూసుకెళ్తోంది. సూక్ష్మ నుంచి మెగా వరకు ఏ కేటగిరీని తీసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు లభిస్తుండటంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 18 : హైదరాబాద్‌ మహానగరం శివారు చుట్టూ జిల్లా విస్తరించి ఉండటం, అనువైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దపెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే ఇండస్ర్టియల్‌ పార్కులు, హార్డ్‌వేర్‌ పార్కులు, ఐటీ టవర్స్‌, మెగా ఉత్పత్తి పరిశ్రమలు వెలిశాయి. ఇప్పటివరకు టీఎ్‌స-ఐపాస్‌ కింద 1,512 పరిశ్రమలు రూ.72502.12కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులతో, 9,58,647 మంది ప్రతిపాదిత ఉపాధితో వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 1,123 పరిశ్రమలకు రూ.42769.27కోట్ల పెట్టుబడితో, 4,64,792 మంది ఉపాధితో స్థాపించడం జరిగింది. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం 19333.20 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ పార్క్‌తో రూ.63వేల కోట్ల పెట్టుబడి, 1.70లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. జిల్లాలో ప్రముఖ సంస్థలైన టాటా గ్రూప్‌, అమెజాన్‌, పీఅండ్‌జీ, వెల్పెన్‌, విప్రో, పోకర్ణ, ప్రీమియర్‌ ఎనెర్జిస్‌, రేడియంట్‌, చిరిపాల్‌ కంపెనీలు తమ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అమెజాన్‌ సంస్థకి చెందిన మూడు డేటా సెంటర్లు, మైక్రోసాఫ్ట్‌ సంస్థకి చెందిన మూడు డేటా సెంటర్స్‌ జిల్లాలో ఏర్పాటు చేశారు. గూగుల్‌ అమెరికా వెలుపల అతి పెద్ద క్యాంపస్‌ నిర్మాణ పనులను గచ్చిబౌలిలో ప్రారంభించింది. ఇందులో 3.30 మిలియన్‌ చదరపు అడుగుల వర్క్‌స్పేస్‌ అందుబాటులోకి వచ్చేలా భవనాన్ని గూగుల్‌ డిజైన్‌ చేసింది. జిల్లాలో టీ-ప్రైడ్‌ స్కీం కింద 2015 సంవత్సరం నుంచి 3,807 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.78.32 కోట్లు పెట్టుబడి సహాయం అందించారు. 

2014 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం(టీఎస్‌-ఐపాస్‌) అమల్లోకి రావడంతో మహర్దశ పట్టింది. త్వరితగతిన అనుమతులు జారీ చేయడం, నెల రోజుల నిర్దిష్ట సమయంలో అనుమతుల మంజూరు, ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం వంటి పాలసీలతో పారిశ్రామిక వేత్తలకు అనువుగా మారింది. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు కూడా ఈ జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఒక్కో మెగా కంపెనీ వేల కోట్లు పెట్టుబడులు పెడుతుండగా మరికొన్ని విస్తరణకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దేశంలోని అమెజాన్‌, వెల్‌స్పన్‌, క్రోనస్‌, టాటా, విజయ్‌నేహా, పోకర్ణ ఇంజనీర్‌ స్టోన్‌, నాట్కోఫార్మా, రెనెసిస్‌, కాస్పర్‌, విప్రో, ఎంఎ్‌సఎన్‌ లాంటి ప్రముఖ పరిశ్రమల ప్లాంట్లు జిల్లాకు తరలివచ్చాయి. ప్రభుత్వం తీసుకు వచ్చిన టీఎ్‌స-ఐపాస్‌ ద్వారా పారిశ్రామిక రంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే.. ఆరు నెలలకు పైగా సమయం పట్టేది. అనుమతి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉండేది. టీఎ్‌స-ఐపాస్‌ విధానంతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు కేవలం 15 రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయి. దీంతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. పరిశ్రమల నాణ్యతకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుండటంతో పరిశ్రమలను నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ఉత్సా హం చూపుతున్నారు. బహుళ జాతీయ సంస్థ అమెజాన్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోంది. హైదరాబాద్‌ సెంటర్‌గా రూ.20,761 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో సింహభాగం ఇన్వెస్టుమెంట్లు జిల్లాలోనే ఉండనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ఈ-కామర్స్‌, ఐటీ రంగాల్లో అమెజాన్‌ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొత్తగా డేటా క్లాడ్‌ సెక్టార్‌లో వ్యాపారాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు వెస్పన్‌ అత్యధికంగా రూ.1500 కోట్లు పెట్టుబడులు పెడుతుండగా అమెజాన్‌ ఈ మార్క్‌ను అధిగమిస్తోంది. అమెజాన్‌ జిల్లాలో కొత్తగా మూడు చోట్ల డేటా క్లౌడ్‌ సెం టర్లు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కార్యాలయాల నిర్మాణ పనులు మొదలు పెట్టాయి. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌ రెవెన్యూ పరిధి ఫార్మసిటీలో, మహేశ్వరం మండలం ఫ్యాబ్‌ సిటీలో, షాబాద్‌ మండలం చందన్‌వెళ్లి ఇండస్ర్టియల్‌పార్కులో ఈ డేటా సెంటర్లు వెలువనున్నాయి. ఈ మూడు ప్రాం తాల్లో కలిపి తొలి విడతగా రూ.1394 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే అన్ని అనుమతులకు లైన్‌క్లియర్‌ కాగా, నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. చందనవెల్లి, ఫార్మాసిటీలో పనులు పూర్తయ్యాయి. ఈ మూడు సెంటర్ల ద్వారా ప్రత్యక్షంగా 600మందికి,  పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే ఈ-కామర్స్‌ సెక్టార్‌లో అమెజాన్‌ సేవలు మొదలయ్యాయి. జిల్లాలో ప్రముఖ రైల్వే కోచ్‌ తయారీ కంపెనీ మేధా సెర్వోడ్రైవ్‌ రూ. 625 కోట్లతో ప్రారంభించింది. ఇందులో 150 మందికి ఉపాధి కల్పించారు. ప్రముఖ కంపెనీ అయిన స్విన్‌ మ్యాక్స్‌ రూ.250 కోట్లతో తన ఉత్పత్తులను ప్రారంభించించి దీనిలో 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారు. జిల్లాలో ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కెటేక్స్‌ గ్రూప్‌ సీతారాంపూర్‌లో రూ.1400 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే ప్రముఖ సంస్థ ఇస్టర్‌ పిల్మ్‌టెక్‌ రూ.1400 కోట్ల పెట్టుబడితో చందనవెల్లి గ్రామంలో నిర్మాణం చేపడుతోంది. ఇందులో 1,500 మందికి ఉపాధి లభించనుంది. షాబాద్‌ మండలం సీతారాంపూర్‌ గ్రామంలో 1,148 ఎకరాల దేవాదాయశాఖ, ప్రభుత్వ భూములు ఉండగా అందులో 150 ఎకరాల్లో ఎలక్ర్టిక్‌ వాహనాల కంపెనీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రైతుల నుంచి భూ సేకరణ చేపట్టారు. ఎకరానికి రైతుకు రూ. 10.50 లక్షలు పరిహారంగా ఇస్తున్నారు. 


నిర్దేశిత కాలపరిమితిలో అనుమతులు

ఉద్యోగ, ఉపాధి అవసరాల కల్పనలో పరిశ్రమల పాత్ర ముఖ్యమైనది. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతులను టీఎ్‌స-ఐపాస్‌ ద్వారా నిర్దేశిత కాలపరిమితిలో మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు టీఎస్‌ ఐపాస్‌ కింద 1,123 పరిశ్రమలు 42,769 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబడి 4,64,792 మందికి ఉపాధి కల్పించబడింది. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం 19,333 ఎకరాలలో 63 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుంది. 

- రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌



Updated Date - 2022-08-19T05:11:01+05:30 IST