గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2021-08-04T06:01:17+05:30 IST

గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల్లో వరుసగా తనిఖీలు నిర్వహించారు.

గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై విజిలెన్స్‌ దాడులు
విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించిన గ్రానైట్‌ ఫ్యాక్టరీ

మూడు బృందాలతో ముమ్మర తనిఖీలు

యజమానులకు నోటీసులు జారీ

చీమకుర్తి, ఆగస్టు 3: గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల్లో వరుసగా తనిఖీలు  నిర్వహించారు. సోమ, మంగళవారాల్లో పది ఫ్యాక్టరీల్లో సోదాలు పూర్తి చేశారు. రీజనల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ అశోక్‌వర్ధన్‌ పర్యవేక్షణలో మూడు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. కరోనా నేపఽథ్యం, షిప్పింగ్‌ చార్జీల పెరుగుదల సమస్యలతో స్లాబులను కొనేవారు కరువై ఫ్యాక్టరీల్లోనే సరుకు మూలుగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజిలెన్స్‌ దాడులు నిర్వహించటంపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ ఓనర్ల నుంచి ముడిరాయి కొనుగోలు చేసే సమయంలో కొందరు బిల్లులు ఇవ్వడం లేదు. అదేసమయంలో ఫ్యాక్టరీల్లో సరుకు భారీగా నిల్వ ఉన్న నేపథ్యంలో తనిఖీల్లో తేడాలుండే అవకాశం ఉంది. తనిఖీలు కూడా కొందరినే లక్ష్యం చేసుకుని నిర్వహిస్తుండటంతో యజమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. తనిఖీల అనంతరం నోటీసులు జారీ చేస్తున్నారు. డీఎస్పీ అశోక్‌వర్ధన్‌ తనిఖీలపై స్పందిస్తూ అక్రమ రవాణాలో పట్టుబడిన స్లాబులు వచ్చిన ఫ్యాక్టరీలను, లావాదేవీలపై తమకు అనుమానం వచ్చిన ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇవి కొనసాగుతాయని తెలిపారు.





Updated Date - 2021-08-04T06:01:17+05:30 IST