కార్పొరేటర్లపై విజిలెన్స్‌

ABN , First Publish Date - 2022-05-15T06:35:49+05:30 IST

నగరంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్ల దందాలు దర్జాగా సాగిపోతున్నాయి.

కార్పొరేటర్లపై విజిలెన్స్‌

వైసీపీకి చెందిన 17 మందిపై ఆరా

పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ

యథేచ్ఛగా అక్రమాలు 

ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని మరీ వసూళ్లు 

బడ్డీ వ్యాపారి నుంచి బిల్డర్స్‌ వరకు అంతా బాధితులే

పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్ల దందాలు దర్జాగా సాగిపోతున్నాయి. ఈ అడ్డగోలు వ్యవహారాలపై పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నా...అక్రమాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేటర్లపై ఇంటెలిజెన్స్‌ అధికారులు నిఘా పెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే సాగిన, సాగుతున్న దందాల పూర్తి సమాచారాన్ని సేకరించి, ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు ప్రచారం జరుగుతోంది.

జీవీఎంసీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత కొంతమంది అఽధికార పార్టీ కార్పొరేటర్లు అంతా తామై చక్రం తిప్పడం మొదలుపెట్టారు. తమ వార్డు పరిధిలో ఏ పని జరగాలన్నా, ఎవరు భవన నిర్మాణం చేపట్టాలన్నా వారిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్నట్టు వ్యవహరిస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలు, పారిశుధ్య సిబ్బంది కూడా వారి కనుసన్నల్లోనే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితిని కల్పించారు. అంతేకాదు చిరు వ్యాపారి బడ్డీ పెట్టుకోవాలనుకున్నా వీరి అనుమతి కావాల్సిందే. లేదంటే అధికారులను రప్పించి, దగ్గరుండి మరీ తీయించేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటే బడ్డీలను ఏర్పాటుచేయించి, వారే ప్రారంభోత్సవం చేస్తుంటారు. అంతేకాదు అధికారులు అటువైపు చూడకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. 


అంతా వారి కనుసన్నల్లోనే...

కొంతమంది కార్పొరేటర్లు తమ దందాలు, అక్రమాలకు అడ్డే లేనట్టు వ్యవహరిస్తుండడం అధికార పార్టీ నేతలు, సహచర కార్పొరేటర్లను విస్మయానికి గురిచేస్తోంది. తూర్పు నియోజకవర్గంలోని ఒక మహిళా కార్పొరేటర్‌ వార్డును గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులే నియోజకవర్గంలో కీలక నేతలు కావడంతో, భయం లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు. భవన నిర్మాణాల నుంచి జీవీఎంసీకి వాహనాలు సమకూర్చే కాంట్రాక్టర్లను వరకూ ఎవరినీ వదలకుండా తన నివాసానికి పిలిపించుకుని బేరాలు ఆడేస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్‌ అధికారులకు సమాచారం అందడంతో, విచారణ జరిపి వాస్తవమేనని నివేదిక రూపొందించినట్టు తెలిసింది. 


చక్రం తిప్పుతున్న మహిళా నేతల భర్తలు 

అదే జోన్‌లో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక మహిళా వార్డు కార్పొరేటర్‌ భర్తను చూస్తేనే జనం భయపడిపోతున్నారు. భవన నిర్మాణాలు చేపట్టినవారు, చివరకు తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారు కూడా హడలిపోతున్నారు. ఉన్నత విద్యావంతురాలినని చెప్పుకునే సదరు మహిళా కార్పొరేటర్‌ కూడా భర్త ఆగడాలకు అడ్డుచెప్పకుండా, వసూళ్లను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు జాతీయ రహదారికి ఆనుకుని వున్న ఓ లేఅవుట్‌లో ప్రతి ఇంటి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసినట్టు ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఓ మహిళా కార్పొరేటర్‌ భర్త కూడా ఇదే తరహాలో దందాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపైనా అధికారులు విచారణ జరిపి నివేదిక రూపొందించినట్టు తెలిసింది. అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మించే బిల్డర్లను ప్రధాన ఆదాయవనరుగా మార్చుకుని, ఆయన...బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ప్రైవేటు వ్యక్తులతో దందా

పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఒక కార్పొరేటర్‌ నిత్యం కాసులవేటలోనే ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని మరీ తన వార్డుతో పాటు, సరిహద్దు వార్డుల్లోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని విజిలెన్స్‌ దృష్టికి వచ్చింది. ఇక ఉత్తర నియోజకవర్గం పరిధిలో కార్పొరేటర్‌గా గెలిచి, కౌన్సిల్‌లో కీలకస్థానంలో ఉన్న మరో కార్పొరేటర్‌ వసూళ్లే పరమావధిగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో రాత్రి ఫుడ్‌ కోర్టు విషయంలో వ్యాపారుల నుంచి ఆయన భారీగా డబ్బు గుంజారని, వ్యాపారులతో సమావేశం ఏర్పాటుచేసి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు చొప్పున 80 మంది నుంచి వసూలు చేసినట్టు ప్రచారం జరిగింది. అదే నియోజకవర్గం పరిధిలో మరో కార్పొరేటర్‌పైనా ఇదే తరహా ఆరోపణలున్నాయి. పార్టీ కీలక నాయకులతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని దందాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.  అదేవిధంగా దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఇద్దరు కార్పొరేటర్లు, గాజువాక నియోజకవర్గం పరిధిలో వైసీపీకి చెందిన కొంతమంది, టీడీపీ నుంచి గెలిచి వైసీపీ పంచన చేరిన మరో కార్పొరేటర్‌ భవన నిర్మాణాలపైనే బతికేస్తున్నారని బహిరంగంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 17 మంది కార్పొరేటర్లపైనే ప్రధానంగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నిఘా పెట్టారని, అడ్డగోలు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదించారని చెబుతున్నారు. 

Updated Date - 2022-05-15T06:35:49+05:30 IST