జీజీహెచ్‌పై విజి‘లెన్స్‌’!

ABN , First Publish Date - 2022-08-02T05:21:49+05:30 IST

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)పై విజిలెన్స్‌ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోమవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు జీజీహెచ్‌లో ఉదయం నుంచి రాత్రివరకు తనిఖీ చేశారు.

జీజీహెచ్‌పై విజి‘లెన్స్‌’!
జీజీహెచ్‌లో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

సర్వజన ఆస్పత్రిలో రోజంతా తనిఖీలు
రికార్డుల పరిశీలన
మందులు, బయోమెట్రిక్‌ వివరాలపై ఆరా
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 1:
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)పై విజిలెన్స్‌ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోమవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు జీజీహెచ్‌లో ఉదయం నుంచి రాత్రివరకు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రోజువారీ నమోదవుతున్న ఓపీతో పాటు వైద్యుల వివరాలు.. పంపిణీ చేస్తున్న మందులపై ఆరా తీశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులు.. రోగులకు ఇస్తున్న మందులు సరిపోయాయా? పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించారు. వైద్యకళాశాల ప్రొఫెసర్లు ఆసుపత్రిలో అందిస్తున్న సేవలపైనా ఆరా తీశారు. ఆసుపత్రిలోని పరికరాలు, జనరేటర్‌, ఇతర సదుపాయాలను పరిశీలించారు. వసతులు, వనరుల వినియోగంపై ఆరాతీశారు. వైద్యులు సమయపాలన పాటిస్తున్నారో లేదోనని బయోమెట్రిక్‌ హాజరు వివరాలను పరిశీలించారు. వైద్యులందరితో మాట్లాడారు. ఆస్పత్రిలో నీటి వసతి, బాత్‌రూమ్‌ల శుభ్రత, ఎంతమంది సిబ్బంది ఉండాలి.. ప్రస్తుతం ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్రంగా నివేదిక పంపుతామని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు.

Updated Date - 2022-08-02T05:21:49+05:30 IST