HYD : స్కూటర్‌పై వ్యర్థాలు తరలించారట.. GHMC లో విజిలెన్స్ విచారణ మొదలు.. ఏం తేలుస్తారో..!?

ABN , First Publish Date - 2021-10-12T16:48:59+05:30 IST

నాలాల పూడికతీతపై జీహెచ్‌ఎంసీలో విజిలెన్స్‌ విచారణ మొదలైంది. వ్యర్థాల..

HYD : స్కూటర్‌పై వ్యర్థాలు తరలించారట.. GHMC లో విజిలెన్స్ విచారణ మొదలు.. ఏం తేలుస్తారో..!?

  • ఇప్పటికే సర్కిళ్ల వారీగా నోటీసులు
  • సమాచారం సేకరణ 
  • పూడికతీతలో అవకతవకలపై ఫిర్యాదులు
  • రూ.45 కోట్లతో ఈ యేడాది పనులు
  • 50 శాతానికి పైగా అక్రమమే అని ప్రచారం
  • పూడిక‘మేత’పై విజిలెన్స్‌ విచారణ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ : నాలాల పూడికతీతపై జీహెచ్‌ఎంసీలో విజిలెన్స్‌ విచారణ మొదలైంది. వ్యర్థాల తొలగింపు, తరలింపులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈవీడీఎం పరిధిలోని విజిలెన్స్‌ విభాగం వివరాలు సేకరిస్తోంది. వ్యర్థాలు ఏ ప్రాంతాల్లో తొలగించారు, ఎక్కడ డంప్‌ చేశారు, ఎప్పుడు పనులు జరిగాయి, ఏ వాహనాల్లో తరలించారనే సమాచారాన్ని సర్కిళ్ల వారీగా సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్కిళ్ల అధికారులు స్పందించారని, ఇంకొన్ని చోట్ల నుంచి వివరాలు రావాల్సి ఉందని విజిలెన్స్‌ వర్గాలు తెలిపాయి. గ్రేటర్‌లో 870 కి.మీల మేర ఉన్న నాలాలు/డ్రైన్‌లలో 2021 సంవత్సరానికిగాను రూ.45 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. ప్రవాహ వ్యర్థాలతో పాటు, చెత్తా చెదారాన్ని ఏడాది పాటు తొలగించడం కాంట్రాక్టు సంస్థల బాధ్యత. చాలా ప్రాంతాల్లో తొలగించకుండానే వ్యర్థాలు తీసినట్టు.. తరలించినట్టు కాగితాల్లో చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో అక్రమాలు జరిగాయని రుజువైంది.


అవినీతికి కొత్త దారులు..

మూడేళ్ల క్రితం నాలాల పూడికతీతలో జరిగిన అక్రమాలు సంచలనం సృష్టించాయి. అవినీతికి కొందరు ఇంజనీర్లు కొత్త దారులు చూపుతూ.. కార్లు, స్కూటర్లు, ఆటోల్లో వ్యర్థాలు తరలించినట్టు చూపి అడ్డంగా దొరికిపోయారు. పూర్వ ఖైరతాబాద్‌ జోన్‌లో దాదాపు అన్ని సర్కిళ్లలో ఇదే తతంగం జరిగింది. క్షేత్రస్థాయిలో వ్యర్ధాలు తొలగించకుండానే తీసినట్టు కాగితాల్లో కనికట్టు చేసిన ఇంజనీర్లు.. ద్విచక్ర వాహనా లు, కార్ల నెంబర్లను గుడ్డిగా రికార్డుల్లో నమోదు చేశారు. బిల్లుల చెల్లింపు క్రమంలో ఆడిట్‌ విభాగం పరిశీలించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)లో ఫిర్యాదు చేశారు. పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను పోలీ సులు విచారించారు.


50 శాతానికిపైగా...

పోలీస్‌ కేసు నమోదైనా.. జీహెచ్‌ఎంసీలో పూడికమేత ఆగలేదు. గతం కంటే అధికంగానే కొన్ని సర్కిళ్లలో అవకతవకలు జరుగుతు న్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నాలాల్లో వర్షపు నీటితోపాటు సాధారణ రోజుల్లో మురుగు నీరు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో వ్యర్థాలు మేట వేస్తుంటాయి. తొలగించినా.. మూన్నాళ్లకే ప్రవాహంతోపాటు చెత్త మళ్లీ చేరుతుంది. దీనిని అవకాశంగా మలుచుకుంటోన్న కొందరు అధికారులు.. వ్యర్థాలు తొలగించకుండానే తీసినట్టు చూపుతున్నారు. పలు కాలనీలు, బస్తీల్లో స్థానికులు తమ ఏరియాలోని నాలాలు చెత్త తీయడం ఎప్పుడూ చూడలేదని చెబుతుండడం ఇందుకు నిదర్శనం. జీహెచ్‌ఎంసీలోని పలు సర్కిళ్లలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు పూడికతీత కాసుల పండుగగా మారింది. ప్రతి యేటా రూ.42-45 కోట్ల పనులు చేస్తుండగా.. ఇందులో దాదాపు 20-25 కోట్ల వరకు వారి జేబుల్లోకి వెళ్తాయన్న ప్రచారం ఉంది.


విచారణ ఇలా..

అధికారుల నుంచి సమాచారం వచ్చిన అనంతరం విచారణ ప్రారంభిస్తామని విజిలెన్స్‌ వర్గాలు చెబుతు న్నాయి. సంబంధిత ఇంజనీర్లు ఇచ్చిన వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి క్రాస్‌ చెక్‌ చేయనున్నారు. ఏరియాల వారీగా వెళ్లే విజిలెన్స్‌ అధికారులు.. ఆయా ప్రాంతాల్లోని నాలాల్లో వ్యర్థాలు తొలగించారా, లేదా..? ఎప్పుడు తీశారు..? తదితర వివరాలు స్థానికులను అడిగి తెలుసుకోనున్నారు. నెం బర్‌ ఆధారంగా వాహనాల్లో తరలింపు నిజమేనా, కాదా..? అన్నదీ తేల్చనున్నారు. పూడికతీతకు వినియోగించిన పొక్లెయినర్‌, ఇతర యంత్రాల డ్రైవర్ల తోనూ మాట్లాడతామని ఓ అధికారి తెలిపారు.


Updated Date - 2021-10-12T16:48:59+05:30 IST