విద్యాతపస్వి అంబేడ్కర్

ABN , First Publish Date - 2021-04-14T07:29:40+05:30 IST

జీవితంలో ఎదుయ్యే సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకు, అవరోధాలను అధిగమించేందుకు ఎవరికైనా సరే విద్య తోడ్పడినట్టు మరేదీ...

విద్యాతపస్వి అంబేడ్కర్

జీవితంలో ఎదుయ్యే సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకు, అవరోధాలను అధిగమించేందుకు ఎవరికైనా సరే విద్య తోడ్పడినట్టు మరేదీ సహాయపడదు. అంటరానితనం మొదలైన సామాజిక దురాచారాలను పేదరికపు అమానుష ఆర్థిక అవస్థలను జయించేందుకు విద్యాసక్తి విశేషంగా దోహదం చేస్తుంది. బాబాసాహెబ్ భీమ్ రావు అంబేడ్కర్ జీవితమే ఇందుకు ఒక ఉదాహరణ. 


భీమ్ రావు రాంజీ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. సుబేదార్ రాంజీ మాలోజీ సక్పాల్ 14వ, ఆఖరి బిడ్డ అంబేడ్కర్. తల్లి భీమాబాయి సక్పాల్. అస్పృశ్యులుగా భావించే మహర్ కులంలో ఆయన ప్రభవించారు. తన సామాజిక వర్గం ఎదుర్కొనే సకల వివక్షలనూ అంబేడ్కర్ సైతం చవి చూశారు. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలంటే విద్యే ప్రధాన సాధనమనే సత్యాన్ని అంబేడ్కర్ చాలా చిన్న వయస్సులోనే గ్రహించారు.


జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించే ఎవరికైనా అంబేడ్కర్ జీవితం ఒక స్ఫూర్తి. ఆయన ఒక విద్యా తపస్వి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాలతో సహా మొత్తం 26 డిగ్రీలు, బిరుదులు అంబేడ్కర్ పేరుకు వన్నె కల్పిస్తున్నాయి. విద్య మానవులను సమున్నతులను చేస్తుందని, సమాజంలో మార్పులు, ప్రగతికి దారులు వేస్తుందని అంబేడ్కర్ విశ్వసించారు. ‘మేధా కృషి మానవ అస్తిత్వ అంతిమ లక్ష్యం కావాలని’ ఆయన అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో అర్థశాస్త్రంలో పరిశోధనలు చేసి డాక్టొరేట్ డిగ్రీ పొందిన తొలి భారతీయుడు అంబేడ్కరే. దక్షిణాసియాలో అర్థశాస్త్రంలో రెండు డాక్టొరేట్ డిగ్రీలు పొందిన తొలి వ్యక్తికూడా ఆయనే. అంబేడ్కర్ తన తరంలోని ఉత్కృష్ట విద్యావంతులలో సమున్నతుడు. కొలంబియా విశ్వవిద్యాలయం (అమెరికా)లో విద్యాబ్యాసం చేసిన మూడేళ్ళలో ఆయన ఆర్థిక శాస్త్రంలో 29 కోర్సులు, చరిత్రలో 11, సామాజిక శాస్త్రంలో 6, మానవశాస్త్రంలో 4, రాజనీతి శాస్త్రంలో మూడు, ఫ్రెంచ్, జర్మన్ భాషలలో ఒకొక్క కోర్సు చేశారు. ‘సమాజ జీవితంలో ఏర్పర్చాల్సిన ఏకైక ప్రమాణం విద్య’ అని ఆయన విశ్వసించారు. తన విజ్ఞానాన్ని, విద్వత్తును మరింత విశాలం చేసుకునేందుకు అంతిమ క్షణం వరకు అంకితమయిన జ్ఞాని బాబాసాహెబ్ అంబేడ్కర్. ఈ సందర్భంగా ప్రగతిశీలి అయిన బరోడా మహారాజా శాయాజీరావు గైక్వాడ్ అందించిన ఉపకార వేతనాల ఆసరాతో డాక్టర్ అంబేడ్కర్ అమెరికాలో ఉన్నత విద్యాబ్యాసం చేశారన్న వాస్తవాన్ని ప్రస్తావించి తీరాలి.


అణగారిన వర్గాల వారికి మానవ హక్కులు కల్పించేందుకు డాక్టర్ అంబేడ్కర్ తన జీవిత పర్యంతం పోరాడారు. ఆయన భారతదేశపు ప్రథమ కార్మిక మంత్రి, మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రి. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీ ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ సమున్నత బాధ్యత నిర్వహణలో ఆయన దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటిలోని అత్యుత్తమ అంశాలు అన్నిటినీ భారతీయ సందర్భానికి అనువుగా అనువర్తింప చేశారు. కనుకనే ఆయన ‘భారత రాజ్యాంగ నిర్మాత’గా కీర్తి గడించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి భారతీయ పౌరునికీ సమన్యాయం, సమానత్వాన్ని కల్పించింది. పౌర స్వేచ్ఛలు, మత స్వాతంత్ర్యం, అస్పృశ్యత రద్దు, రిజర్వేషన్లు, సకల వివక్షలపై నిషేధం మొదలైన వన్నీ భారతీయులకు అంబేడ్కర్ ప్రసాదించిన కానుకలు. మహిళలకు సమానహక్కుల కోసం ఆయన పోరాడారు. హిందూ మహిళలకు హిందూపురుషులతో సమాన హక్కులు కల్పిస్తూ తాను రూపొందించిన హిందూ కోడ్ బిల్లును పార్లమెంటు తిరస్కరించినప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక సదుపాయాలు డాక్టర్ అంబేడ్కర్ కృషి ఫలితమేనని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


రాజ్యాంగ రచనలో చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అది జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370 రూపకల్పనకు అంబేడ్కర్ తిరస్కరించడం. దేశ సమైక్యత, జాతి సమగ్రతలకు అది విఘాతమని ఆయన వాదించారు. అంతిమంగా ఆ అధికరణ ముసాయిదాను గోపాలస్వామి అయ్యంగార్ (కశ్మీర్ మహారాజా హరిసింగ్ మాజీ దివాన్) రచించారు. 


అంబేడ్కర్ రాజకీయ, సైద్ధాంతిక జీవితాన్ని స్వాతంత్ర్యానికి పూర్వమూ, స్వాతంత్ర్యానంతర జీవితం అనే రెండు స్పష్టమైన భాగాలుగా విభజించవచ్చు. దేశ ప్రజల మనో భావాలను దృష్టిలో ఉంచుకొని ఆయన రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. సమైక్య, శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. కార్మిక హక్కులను పరిరక్షిస్తున్న కార్మిక చట్టాలన్నీ దేశానికి ఆయన సమకూర్చినవే. శ్రామిక మహిళల శ్రేయ స్సును దృష్టిలో ఉంచుకుని ఆయన వారికి ఎన్నో మాతృత్వ ప్రయోజనాలను కల్పించారు. ప్రసూతి సెలవులను 12 నుంచి 26 నెలలకు పెంచడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబేడ్కర్ సేవలను మరింత ముందుకు తీసుకువెళ్ళింది. అంబేడ్కర్ నిజమైన జాతీయ వాది. సామాజిక న్యాయసాధనకు ఆయన అకుంఠిత కృషి చేశారు. బాబాసాహెబ్ దార్శనికతను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు పటిష్ఠ చర్యలు చేపడుతోంది. పేదలు, అణగారిన వర్గాల వారికి సంక్షేమానికి ఉపకార వేతనాల మొదలు బ్యాంకు రుణాలదాకా అనేక సంక్షేమాలను కల్పించింది. అంబేడ్కర్ మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను 1990లో ఆయనకు ప్రదానం చేశారు. ఏటా ఆయన జయంతిని భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 


2022 ఆగస్టు 15న మనం మన స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం. అయితే డాక్టర్ అంబేడ్కర్ ఏ దురాచారాల నిర్మూలనకు తన జీవితాంతమూ పోరాడారో అవి ఇప్పటికీ మన సమాజాన్ని వేధిస్తూనే ఉన్నాయి. సంకుచిత స్వభావులు మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు, పురాతన వివక్షలు ఇంకా కొనసాగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తరగతుల వారికి రిజర్వేషన్లు రద్దు కానున్నాయనే దుష్ప్రచారం ఆ ప్రయత్నాలలో భాగమే. ఈ దేశంలోని సామాజిక వివక్షలు అన్నీ సమసిపోయేంతరవకు ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ల సదుపాయం అమలు కొనసాగుతుంది. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావులేదు. పరిపూర్ణ సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమత్వాన్ని నెలకొల్పడమే బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అవుతుంది. అసంఖ్యాక భారతీయులను బాధిస్తున్న సామాజిక అసమానతలను రూపు మాపేందుకు విద్య ఒక్కటే సరైన సాధనమని విశ్వసించిన అంబేడ్కర్ స్వప్నించిన భారతదేశ నిర్మాణానికి విద్యా సంస్థలు పునాదులు వేయాలి. డాక్టర్ అంబేడ్కర్ ప్రజల మనిషి. ఆయన కేవలం దళితులకు మాత్రమే నాయకుడు కాదు. 130 కోట్లకు పైగా ఉన్న సమస్త భారత ప్రజలకూ ఆయన ప్రేమాస్పద నాయకుడు. ప్రతి భారతీయుని హృదయంలో అంబేడ్కర్ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. 


బండారు దత్తాత్రేయ

(వ్యాసకర్త హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్)

Updated Date - 2021-04-14T07:29:40+05:30 IST