తెలుగుపై ఏపీ తీరు సరికాదు!

ABN , First Publish Date - 2020-02-22T08:59:14+05:30 IST

తెలుగుపై ఏపీ తీరు సరికాదు!

తెలుగుపై ఏపీ తీరు సరికాదు!

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు తీవ్రంగా ఆక్షేపించారు. విద్యార్థుల బడి భాష, ఇంటి భాష ఒకటికానప్పుడు, వారిలో సృజనాత్మకత సన్నగిల్లుతుందని నొక్కిచెప్పారు. మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన సాగినప్పుడే విద్యార్థులు ఇతర భాషల్లోనూ సులువుగా ప్రావీణ్యం సంపాదించగలరని వ్యక్తం చేశారు. శుక్రవారం బేగంపేట్‌లోని హోటల్‌ ప్లాజాలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ కె.వి రమణాచారిని విశిష్ట పురస్కారంతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకటినుంచి ఆరో తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని యునెస్కో చెప్పిన మాటలను విద్యాసాగర్‌ రావు నొక్కిచెప్పారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరినీ ఏకంచేస్తూ తెలుగు భాషా పరిరక్షణోద్యమానికి తాను శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. రమణాచారి మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా దొరుకుతాయనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమే నన్నారు. ఎన్బీటీ సంపాదకుడు మోహన్‌, కొలకలూరి ఇనాక్‌, విశ్వనాథ సాహి త్య పీఠం వ్యవస్థాపకుడు వెల్చాల కొండలరావు, తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జె. చెన్నయ్య  పాల్గొన్నారు.  

Updated Date - 2020-02-22T08:59:14+05:30 IST