Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యాశాఖలో సందడి

35 మంది ఎస్‌ఏలకు గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

29న ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా ప్రమోషన్‌


నెల్లూరు (విద్య) అక్టోబరు 25 : జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి ప్రక్రియ ప్రారంభమైంది. కొవిడ్‌ కారణంగా అవరోధం ఏర్పడిన కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ప్రస్తు తం అడ్డంకులు తొలిగాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనిపై పలు అభ్యంతరాలు, వినతుల అనంతరం జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలో అర్హత కలిగిన 35 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా సోమవారం ఉద్యోగోన్నతి కల్పించారు. తద్వారా కావలి డివిజన్‌ పరిధిలోని 13, నెల్లూరు డివిజన్‌ పరిధిలోని 8, గూడూరు డివిజన్‌లోని 14 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్‌-2 హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌ పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ నిర్వహించి వెంటనే నియామక పత్రాలను కూడా అందచేశారు. 

గతంలో పదోన్నతి పొంది ఖాళీ అయిన స్థానం, ఎవరైనా ఉపాధ్యాయులు మరణించి ఉంటే ఖాళీ అయిన స్థానం, ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానాలను మాత్రమే ఉద్యోగోన్నతి ద్వారా భర్తీ చేయనున్నారు. నవంబరు 1లోపు ఇలాంటి ఖాళీలను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోస్టులను లెక్కించి వాటిలో 70శాతం ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయగా మిగిలిన 30 శాతం పోస్టులను రానున్న డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా, ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతికి సంబంధించి అర్హత కలిగిన వారి సీనియారిటీ జాబితాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి సబ్జెక్టుల వారీగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఈనెల 29న కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉద్యోగోన్నతి కల్పిస్తామని డీఈవో రమేష్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement